Thursday, April 27, 2006

కూనలమ్మ పదాలు by ఆరుద్ర

సర్వజనులకు శాంతి
స్వస్తి, సంపద, శ్రాంతి
నే కోరు విక్రాంతి
ఓ కూనలమ్మ

ఈ పదమ్ముల క్లుప్తి
ఇచ్చింది సంతృప్తి
చేయనిమ్ము సమాప్తి
ఓ కూనలమ్మ

సామ్యవాద పథమ్ము
సౌమ్యమైన విధమ్ము
సకల సౌఖ్యప్రదమ్ము
ఓ కూనలమ్మ

అరుణబింబము రీతి
అమర నెహ్రూ నీతి
ఆరిపోవని జ్యోతి
ఓ కూనలమ్మ

సర్వజనులకు శాంతి
స్వస్తి, సంపద, శ్రాంతి
నే కోరు విక్రాంతి
ఓ కూనలమ్మ

ఈ పదమ్ముల క్లుప్తి
ఇచ్చింది సంతృప్తి
చేయనిమ్ము సమాప్తి
ఓ కూనలమ్మ

తెలివితేటల తాడు
తెంపుకొను మొనగాడు
అతివాద కామ్రేడు
ఓ కూనలమ్మ

ఇజము నెరిగిన వాడు
నిజము చెప్పని నాడు
ప్రజకు జరుగును కీడు
ఓ కూనలమ్మ

స్టాలినిస్టు చరిత్ర
సగము గాడిదగత్ర
చదువుకో ఇతరత్ర
ఓ కూనలమ్మ

మధ్యతరగతి గేస్తు
మంచి బందోబస్తు
జనులకిక శుభమస్తు
ఓ కూనలమ్మ

దహనకాండల కొరివి
తగలబెట్టును తెలివి
కాదు కాదిక అలవి
ఓ కూనలమ్మ

కూరుచుండిన కొమ్మ
కొట్టుకొను వాజమ్మ
హితము వినడు కదమ్మ
ఓ కూనలమ్మ

కష్టజీవుల కొంప
కాల్చి బూడిద నింప
తెగునులే తన దుంప
ఓ కూనలమ్మ

జనుల ప్రేముడి సొమ్ము
క్షణము లోపల దుమ్ము
తులువ చేయును సుమ్ము
ఓ కూనలమ్మ

మధువు మైకము నిచ్చు
వధువు లాహిరి తెచ్చు
పదవి కైపే హెచ్చు
ఓ కూనలమ్మ

హరుడు అధికుడు కాడు
నరుడు అల్పుడు కాడు
తమకు తామే ఈడు
ఓ కూనలమ్మ

సుదతిపాలిట భర్త
మొదట వలపుల హర్త
పిదప కర్మకు కర్త
ఓ కూనలమ్మ

చివరి ప్రాసల నాభి
చిత్రమైన పఠాభి
కావ్యసుధట షరాభి
ఓ కూనలమ్మ

తీర్చినట్టి బకాయి
తెచ్చిపెట్టును హాయి
అప్పు మెడలో రాయి
ఓ కూనలమ్మ

నిజము నిలువని నీడ
నీతి యన్నది చూడ
గాజు పెంకుల గోడ
ఓ కూనలమ్మ

చెప్పి దేవుని పేరు
చెడుపు చేసెడివారు
ఏల సుఖపడతారు
ఓ కూనలమ్మ

ఈశుడంతటివాడు
ఇల్లరికమున్నాడు
పెండ్లయిన మరునాడు
ఓ కూనలమ్మ

మరియెకరి చెడు తేది
మనకు నేడు ఉగాది
పంచాంగమొక సోది
ఓ కూనలమ్మ

జనులు గొర్రెలమంద
జగతి వేసెడు నింద
జమకట్టు స్తుతి క్రింద
ఓ కూనలమ్మ

ఉడుకు రచనల యందు
ఎడద మెదడుల విందు
లేటు గోపీచందు
ఓ కూనలమ్మ

ఇరకు కార్యపు గదులు
ఇరుకు గోడల బదులు
మేలు వెన్నెల పొదలు
ఓ కూనలమ్మ

కోర్టుకెక్కిన వాడు
కొండనెక్కిన వాడు
వడివడిగ దిగిరాడు
ఓ కూనలమ్మ

పరుల తెగడుట వల్ల
బలిమి పొగడుట వల్ల
కీర్తి వచ్చుట కల్ల
ఓ కూనలమ్మ

కోపాగ్నులకు వృద్ధి
కుత్సితాలకు రద్ది
లేమి చంపు సుబుద్ధి
ఓ కూనలమ్మ

అతివ పలుకే చాలు
అందు వేనకువేలు
మొలచు నానార్థాలు
ఓ కూనలమ్మ

చెక్కు చెదరని వక్త
చేదు నిజము ప్రయోక్త
చంపబడును ప్రవక్త
ఓ కూనలమ్మ

ఎంకి పాటల దారి
ఎడద గుర్రపు స్వారి
చేయులే నండూరి
ఓ కూనలమ్మ

ఆలు మగల లడాయి
అంత మొందిన రేయి
అనుమానపు హాయి
ఓ కూనలమ్మ

బ్రూటు కేసిన ఓటు
బురదలో గిరవాటు
కడకు తెచ్చును చేటు
ఓ కూనలమ్మ

రాజముద్రికె మొహరు
ప్రజల నేతయె నెహురు
స్వేచ్ఛ పేరే యుహురు
ఓ కూనలమ్మ

జనులు నమ్మెడివరకు
కనులు తెరవని వరకు
వెలుగు నకిలీ సరకు
ఓ కూనలమ్మ

పాత సీసాలందు
నూతనత్వపు మందు
నింపితే ఏమందు?
ఓ కూనలమ్మ

అయిదు రోజులు వేస్టు
అగుట కెయ్యది బెస్టుఝ
చూడుము క్రికెట్‌ టెస్టు
ఓ కూనలమ్మ

'అతడు - ఆమె'ల ఫైటు
అతివ ఛాన్సులు బ్రైటు
ఆడదెపుడూ రైటు
ఓ కూనలమ్మ

ఆత్మవంచన వల్ల
ఆడు కల్లల వల్ల
అగును హృదయము డొల్ల
ఓ కూనలమ్మ

వాతలుండిన నక్క
వ్యాఘ్రజాతిలొ లెక్క
అనును కద తలతిక్క
ఓ కూనలమ్మ

నూతిలోపలి కప్ప
పాతఘనతలు తప్ప
మెచ్చ దితరుల గొప్ప
ఓ కూనలమ్మ

నరుడు మదిలో దొంగ
నాల్క బూతుల బుంగ
కడుగ జాలదు గంగ
ఓ కూనలమ్మ

పంగనామము లేల
భస్మ పుండ్రము లేల
భక్తి నిజమగు వేళ
ఓ కూనలమ్మ

అతివ పురుషుని దీటు
అనుచు నభమున చాటు
ఆడ కాస్మోనాటు
ఓ కూనలమ్మ

ప్రజలు చేసెడి పొదుపు
ప్రభుత ఫ్యాడుల మదుపు
సంగయాత్రలో కుదుపు
ఓ కూనలమ్మ

కొత్త పెండ్లము వండు
గొడ్డుకారము మెండు
తీపియను హస్బెండు
ఓ కూనలమ్మ

పాత బిరుదముకన్న
పదవియే కద మిన్న
హ్యూము చాటెను మొన్న
ఓ కూనలమ్మ

గుండెలో శూలమ్ము
గొంతులో శల్యమ్ము
కూళతో స్నేహమ్ము
ఓ కూనలమ్మ

పిరికి ఎలుకల జంట
పిల్లి మెడలో గంట
వెళ్లికట్టిన దంట
ఓ కూనలమ్మ

లంచమనియెడి ఉప్పు
క్లార్కు తింటే తప్పు
ఘనుడు తింటే మెప్పు
ఓ కూనలమ్మ

హృదయమున్న విమర్శ
మెదడు కలచు విమర్శ
తిట్టు నెచ్చెలి స్పర్శ
ఓ కూనలమ్మ

హాస్యమందున అఋణ
అందెవేసిన కరుణ
బుడుగు వెంకటరమణ
ఓ కూనలమ్మ

ఆపరేషను శిక్ష
ఆయుధమ్ముల భిక్ష
ప్రక్కవాడికి కక్ష
ఓ కూనలమ్మ

అత్తవారిని మొక్క
అలక పానుపు యెక్క
మృగము కిందే లెక్క
ఓ కూనలమ్మ

కడకు పాకిస్థాను
కలిసె చైనాతోను
మిత్రుడా! సైతాను?
ఓ కూనలమ్మ

పడతి వలపుల కలలు
పండి వేసెడి గెలలు
వెలుగు నీడల వలలు
ఓ కూనలమ్మ

కుమతియొక్క సమీక్ష
గుబ్బ యెముక పరీక్ష
చేయువలయు ఉపేక్ష
ఓ కూనలమ్మ

ఏకపత్నీ వ్రతము
ఎలుగెత్తు మన మతము
వేల్పు భార్యలో? శతము!
ఓ కూనలమ్మ

పాలకోసము రాళ్లు
భరియించుమను వాళ్లు
తాము వంచరు వళ్లు
ఓ కూనలమ్మ

గంగగట్టున నూయి
కందకములో గోయి
త్రవ్వేను లొల్లాయి
ఓ కూనలమ్మ

ఆశ తీరని తృష్ణ
అఘము తేలని ప్రశ్న
ప్రతిభ అడవుల జ్యోత్స్న
ఓ కూనలమ్మ

బండి కూల్చెను తొల్లి
బండి తోలెను మళ్లి
దండి ఊసరవెల్లి
ఓ కూనలమ్మ

మేనమామకు యముడు
మేనయత్తకు మరుడు
ఘనుడుకద మాధవుడు
ఓ కూనలమ్మ

గుడి గోడ నలరారు
పడతిదుస్తుల తీరు
ఫిల్ములో సెన్సారు
ఓ కూనలమ్మ

చలిహోమ గుండాలు
పలు సోమపానాలు
అది బార్‌-బి-క్యూలు
ఓ కూనలమ్మ

పుణ్య గాథల బూతు
బూజు పట్టిన ట్రూతు
అంతు చిక్కదు లోతు
ఓ కూనలమ్మ

గ్రోలెనే స్తన్యమ్ము
గ్రుద్దెనే ఆ రొమ్ము
వాడెపో దైవమ్ము
ఓ కూనలమ్మ

భక్తి తేనెల యేరు
పసిడి కలల బిడారు
కలసి పోతనగారు
ఓ కూనలమ్మ

తగిన సమయము చూచి
తాను వేయును పేచి
పాలిటిక్సుల బూచి
ఓ కూనలమ్మ

కులము నిచ్చెన నెక్క
గుణము కిందికి తొక్క
దివికి చేరున నక్క?
ఓ కూనలమ్మ

కటిక మూర్ఖుల క్రొవ్వు
కరగజేసెడు నవ్వు
పాప చల్లని నవ్వు
ఓ కూనలమ్మ

కసరు తేనెల వంటి
కథలు కుత్తుకబంటి
నింపు కొడవటిగంటి
ఓ కూనలమ్మ

వెన్న మీగడ పాలు
వెలది సౌందర్యాలు
బాలకృష్ణుని పాలు
ఓ కూనలమ్మ

ఎద్దు నెక్కెను శివుడు
గెద్దపై మాధవుడు
ఘనుడు మన మానవుడు
ఓ కూనలమ్మ

తెల్లవారల హజము
తెల్లవారుట నిజము
లేచె నీగ్రో వ్రజము
ఓ కూనలమ్మ

కసిని పెంచే మతము
కనులు కప్పే గతము
కాదు మన అభిమతము
ఓ కూనలమ్మ

పెరుగుచుండె అప్పు
కరుచుచుండె చెప్పు
కానుపించని నిప్పు
ఓ కూనలమ్మ

నరము లందున కొలిమి
నాగుపాముల చెలిమి
అల్పబుద్ధుల కలిమి
ఓ కూనలమ్మ

గడ్డిపోచలు పేని
గట్టి ఏనుగు నేని
కట్టువాడే జ్ఞాని
ఓ కూనలమ్మ

కయ్యమాడెడి యువతి
తియ్య విలుతుని భవతి
తనకు తానే సవతి
ఓ కూనలమ్మ

మమత పగిలే గ్లాసు
మనికి గుర్రపు రేసు
చిట్టచివరకు లాసు
ఓ కూనలమ్మ

భార్య పుట్టిన రోజు
భర్త మరచిన రోజు
తగ్గె ననుకో మోజు
ఓ కూనలమ్మ

ఎపుడొ పరిణయమైన
ఈడ వుండదు కాన
ఆడ దనబడె చాన
ఓ కూనలమ్మ

సఖుని సన్నని నఖము
చంద్రబింబపు ముఖము
గిల్లినపుడే సుఖము
ఓ కూనలమ్మ

పాదరసమును గెలుచు
పడతి చపలత వలచు
గుండెలందున నిలచు
ఓ కూనలమ్మ

అడ్డు తగిలిన కొలది
అమిత శక్తుల గలది
అబల అగునా వెలది?
ఓ కూనలమ్మ

కొత్తదంటే రోత
చెత్త పాతకు జోత
మనిషి ప్రగతికి ఘాత
ఓ కూనలమ్మ

పిలువకున్నా వెళ్లి
చెరుపజాలును పిల్లి
పలు శుభమ్ముల పెళ్లి
ఓ కూనలమ్మ

మంచి నడవడి లేక
మరులు ఎడదను లేక
మనిషి చేయడు రూక
ఓ కూనలమ్మ

చెరకు రసముల వూట
చిన్మయత్వపు తేట
యోగివేమన మాట
ఓ కూనలమ్మ

రంగు శంకల మగడు
రాజబెట్టిన నెగడు
రమణి ప్రేమకు తగడు
ఓ కూనలమ్మ

పిలిచినప్పుడు రాదు
వెడలగొట్టిన పోదు
వనిత తీయని చేదు
ఓ కూనలమ్మ

అజ్ఞులగు కాకవులు
అయిరి కాకాకవులు
మూసుకో నీ చెవులు
ఓ కూనలమ్మ

పేజి పేజికి వధలు
ప్రెజలు వొల్లని కథలు
ఆరగించును చెదలు
ఓ కూనలమ్మ

పేదలే కానిమ్ము
ప్రభువులే కానిమ్ము
చివర కవరా దుమ్ము
ఓ కూనలమ్మ

కాలవశమున మారి
చాల ముడుపులు కోరి
దేవుడే వ్యాపారి
ఓ కూనలమ్మ

జోలెకట్టె నవాబు
జాలిచూపె గరీబు
మూటకట్టె నవాబు
ఓ కూనలమ్మ

చీట్ల పేకల క్లబ్బు
చివికి కొట్టెడి గబ్బు
మధ్యతరగతి లబ్బు
ఓ కూనలమ్మ

అంతు చూసేవరకు
ఆకట! ఆంధ్రుల చురుకు
నిలువ వుండని సరుకు
ఓ కూనలమ్మ

భర్తతోడను సీత
పట్టు పట్టుటచేత
అట్లు తగలడె రాత!
ఓ కూనలమ్మ

మరచె చేసిన మేలు
చరచె పోరికి కాలు
వాడు చైనా పూలు
ఓ కూనలమ్మ

మనసు కుదరని పెళ్లి
మరుదినమ్మున కుళ్లి
సుఖము హళ్లికి హళ్లి
ఓ కూనలమ్మ

తొలుత కట్టిన బొప్పి
దొసగు వివరము చెప్పి
తొలగుజేమును నొప్పి
ఓ కూనలమ్మ

భాగవతమున భక్తి
భారతములో యుక్తి
రామ కథయే రక్తి
ఓ కూనలమ్మ

బహుదినమ్ములు వేచి
మంచి శకునము చూచి
బయలుళురేరఘ హా-చ్చి
ఓ కూనలమ్మ

ఆలి కొన్నది కోక
అంతరిక్షపు నౌక
అంతకన్నను చౌక
ఓ కూనలమ్మ

పసిడి వన్నెయ తరిగె
పన్ను లెన్నియె పెరిగె
ప్రజల వెన్నులు విరిగె
ఓ కూనలమ్మ

వివిధ నీతులు గలవి
పెక్కు బుక్కులు చదివి
నేను చేసెద మనవి
ఓ కూనలమ్మ

పసిడి వన్నియు తరుగు
ప్రజల కెంతో మెరుగు
పాత మౌఢ్యము విరుగు
ఓ కూనలమ్మ

మిసిమి మెచ్చెడి తులువ
పసిడి కిచ్చును విలువ
నాకు చాలును చెలువ
ఓ కూనలమ్మ

కొంటె బొమ్మల బాపు
కొన్ని తరములసేపు
గుండె వుయ్యెల నూపు
ఓ కూనలమ్మ

అణువు గుండెను చీల్చి
అమిత శక్తిని పేల్చి
నరుడు తన్నున బాల్చి
ఓ కూనలమ్మ

జాలి కరుణలు మాని
ఆలి నేలని వాని
జోలి కెళితే హాని
ఓ కూనలమ్మ

నీరు యెత్తున కేగు
నిజము చాటున దాగు
నీతి నేడొక ప్లేగు
ఓ కూనలమ్మ

తమలపాకులు నములు
దవడతో మాట్లాళు
తానె వచ్చును తమిళు
ఓ కూనలమ్మ

రెండు శ్రీల ధరించి
రెండు పెగ్సు బిగించి
వెలుగు శబ్ద విరించి
ఓ కూనలమ్మ

పెరిగె ఇనకమ్‌ టాక్సు
పెరిగె సూపరు టాక్సు
టాక్సులేనిది సెక్సు
ఓ కూనలమ్మ

తాగుచుండే బుడ్డి
తరగుచుండే కొద్ది
మెదడు మేయును గడి
ఓ కూనలమ్మ

మనసు తెలుపని భాష
మంచి పెంచని భాష
ఉత్త సంద్రపు ఘోష
ఓ కూనలమ్మ

కొంతమందిది నవత
కొంతమందిది యువత
కృష్ణశాస్త్రిది కవిత
ఓ కూనలమ్మ

సన్యసించిన స్వామి
చాలినంత రికామి
చాన దొరికిన కామి
ఓ కూనలమ్మ

లంచ మనియెడి పట్టి
మంచ మేమిటి గట్టి
ఇనుప మేకుల తొట్టి
ఓ కూనలమ్మ

తాను మెచ్చిన కొమ్మ
తళుకు బంగరు బొమ్మ
వలపు గుడ్డి కదమ్మ
ఓ కూనలమ్మ

ఇంటి కప్పుల నెక్కి
ఇపుడు నిజమును నొక్కి
చెప్ప మేలు హుళక్కి
ఓ కూనలమ్మ

సగము కమ్యూనిస్టు
సగము కేపిటలిస్టు
ఎందుకొచ్చిన రొస్టు
ఓ కూనలమ్మ

ఆశ పెరిగిన వాడు
అహము పెరిగిన నాడు
తనకు తానే కీడు
ఓ కూనలమ్మ

గుడిని వీడెను శివుడు
గోడ రాలును చవుడు
కానడే మానవుడు
ఓ కూనలమ్మ

మంచి గంధపు చలువ
మంట వేండ్రపు నిలువ
కుంట నున్నదె చెలువ
ఓ కూనలమ్మ

కావ్య దుగ్ధము పితుక
కఠిన హృదయమె చితుక
ఖలుడు కూడా మెతుక
ఓ కూనలమ్మ

పన్ను వేయని ప్రభుత
పన్ను హ్యూమరు కవిత
ప్రజల కెంతో మమత
ఓ కూనలమ్మ

పిల్ల నిచ్చినవారి
పీకమీద సవారి
చేయూ అల్లుడె మారి
ఓ కూనలమ్మ

పెద్ద జంతువు దంతి
వెడద దంతుల దొంతి
సమము ఒక్క వదంతి
ఓ కూనలమ్మ

ఈసు కన్నుల దోయి
చూచు చెడుపుల వేయి
గుడ్డి ప్రేమే హాయి
ఓ కూనలమ్మ

నీవు పలికిన రీతి
నేను పాడెద నీతి
నీకు చెందుత ఖ్యాతి
ఓ కూనలమ్మ

రాక్షసత్వము పోయి
రాచరికములు పోయి
ప్రజలదే పైచేయి
ఓ కూనలమ్మ

పొరుగు దేశము లిచ్చు
పుల్ల ఇజముల మెచ్చు
మూర్ఖ మెప్పుడు చచ్చు
ఓ కూనలమ్మ

పొరుగు పొలముల హద్దు
పరుల రాజ్యపు హద్దు
దాటువాడే మొద్దు
ఓ కూనలమ్మ

చిన్ని పాదము లందు
చివరి ప్రాసల చిందు
చేయు వీనుల విందు
ఓ కూనలమ్మ

జాతి ఛందము లోన
నీతి చెప్పెడు జాణ
మీటు హృదయపు వీణ
ఓ కూనలమ్మ

పెను సమాసము లున్న
పెద్ద వృత్తముకన్న
చిన్న పదమే మిన్న
ఓ కూనలమ్మ

పరుల మేరును కోరి
పదము లల్లెడువారి
పథము చక్కని దారి
ఓ కూనలమ్మ

వేమన పద్యములు (121 - 130)


121.
ఎండిన మానొకటడవిని
మండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్లన్‌
దండిగల వంశమెల్లను
చండాలుండొకడు పుట్టి చదువును వేమా

తాత్పర్యం:ఎండిన మాను అడవిలో ఉంటే దానిలో నుంచి పుట్టిన అగ్ని అడవి అంతటినీ దహించివేస్తుంది. అలాగే వంశంలో ఒక నీచుడు పుడితే ఆ వంశమే నశించిపోతుంది.

122.
కనులు పోవువాడు కాళ్లు పోయినవాడు
ఉభయులరయుగూడి యుండినట్లు
పేద పేద గూడి పెనగొని యుండును
విశ్వదాభిరామా వినురవేమ

తాత్పర్యం:కుంటి, గుడ్డి పరస్పరము సాయపడునట్లు బీదవానికి బీదవాడే సాయపడును. సజ్జనుడు సజ్జనునే చేరును.

123.
మాటలాడు గల్గు మర్మములెరిగిన
పిన్నపెద్దతనము లెన్నవలదు
పిన్నచేతి దివ్వె పెద్దగా వెలగదా?
విశ్వధాభిరామ వినురవేమ

తాత్పర్యం:మాటలాడు నేర్పు ఉన్నవాడు చిన్నవాడైనా, పెద్దవాడైనా ఒకటే. చిన్నవాళ్ల చేతిలో ఉన్న దీపం కూడా చక్కగానే ప్రకాశిస్తుంది కదా.

124.
కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు
మొండి వాని హితుడు బండవాడు
దుండగీడునకును కొండెడు దళవాయి
విశ్వదాభిరామా వినురవేమ

తాత్పర్యం:కొండముచ్చు పెళ్లికి కోతి పేరంటాలైనట్లు మొండివానికి బండవాడు మిత్రుడైనట్లు. దుర్మార్గునకు అబద్దాలకోరు సహాయపడును.

125.
ఝుషము నీరు వెడల జచ్చుటే సిద్ధము
నీటనుండనేని నిక్కిపడును
అండతొలుగు నెడల నందర పని అట్లే
విశ్వదాభి రామ వినురవేమ

తాత్పర్యం: నీటి నుంచి బయటకు వస్తే చేప మృతిచెందుతుంది. నీటిలో ఉంటేనే ఆనందంగా ఆడుతుంది. అలాగే మానవుడు తనకు తడిన ఆధారం ఉంటే ఆహంకారంతో ప్రవర్తిస్తాడు. లేకపోతే అణిగిపడి ఉంటాడు.

126.
తల్లియేడ్వ వినక తనయాలు వగచిన
జాలిపడెడు వాడు జడుడు సుమ్మి
తారతమ్య మెరుగనేరని పశువది
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: తల్లి బాధపడుతున్నా లెక్కచేయకుండా, భార్య దుఃఖిస్తుంటే భార్యపై జాలిపడే వాడు మూర్ఖుడు. చిన్నా పెద్ద భేదం తెలుసుకొని ఎవరి గౌరవం వారికి ఇవ్వడం తెలియనివాడు పశువుతో సమానం.

127.
అడియాస కొలువుఁ గొలువకు
గుడిమణియము సేయఁబోకు కుజనులతోడన్‌
విడువక కూరిమి సేయకు
మడవినిఁదో డరయఁకొంటి నరుగకు సుమతీ!

తాత్పర్యం:వృథా ప్రయాస అగు సేవను చేయకుము. గుడి ధర్మకర్తృత్వమును చేయకుము. చెడ్డవారితో స్నేహము చేయకుము. అడవిలో సహాయం లేకుండా ఒంటరిగా పోకుము.

128.
పరులమేలు చూసి పలుకాకి వలె
వట్టిమాటలాడు వాడు అధముడు
అట్టివాని బతుకుటదిఏల మంటికా?
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం:పరుల మేలు చూసి ఓర్వలేని వాడు అధముడు. ఇతరుల శ్రేయస్సును చూసి ఆనందించాలి. అలాకాక అసూయపడేవారి బతుకు నిష్ప్రయోజనం.

129.
గంగి గోవుపాలు గరిటడైనను చాలు
కడవెడైనను నేమి ఖరముపాలు
భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం:ఆవుపాలు కొంచమైనా చాలు గాడిదపాలు కుండనిండా ఉన్నా ప్రయోజనం లేదు. ప్రేమతో పెట్టిన తిండి కొంచమైనా తృప్తి ఇస్తుంది. తిడుతూ ఎంత పెట్టినా తృప్తి ఉండదు.

130.
చిక్కియున్నవేళ సింహంబునైనను
బక్క కుక్కయైనా బాధసేయు
బలిమిలేని వేళ పంతములు చెల్లవు
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం:ఎంత గొప్పవాడైనా బలహీనుడైనపుడు అల్పుడికైనా లొంగిపోతాడు. చేజిక్కిన సింహాన్ని బక్క కుక్క కూడా బాధించగలదు కదా!

వేమన పద్యములు (111 - 120)


111.
అల్పబుద్ధివానికధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా
విశ్వదాభిరామ వినుర వేమ

తాత్పర్యం: అల్పుడికి అధికారమిస్తే మంచివారిని పక్కనపెట్టి వంతపాడేవారిని కొలువులో చేర్చుకుంటాడు. చెప్పుతినే కుక్కకు చెరకు తీపి తెలియనట్లే చెడ్డవారికి మంచివారి విలువ తెలియదు.

112.
పట్టుపట్టరాదు పట్టివిడువరాదు
పట్టెనేని బిగియ పట్టవలయు
పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: అవగాహన లేకుండా ఏ పనీ ప్రారంభించకూడదు. మనం చేసే పని యోగ్యమైందని తెలిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని వదలకూడదు. మధ్యలో వచ్చే అంతరాయాలకు, అపాయాలకు, ప్రలోభాలకు గురై పట్టువిడవడం కంటే పడి చచ్చిపోవడమే మంచిది.

113.
తుమ్మచెట్టు ముండ్ల తోడనేపుట్టును
విత్తులొననుండు వెడలునట్లు
మూర్ఖునకును బుద్ధి ముందుగా బుట్టను
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: చెట్టు పుట్టినప్పుడే తుమ్మచెట్టుకు ముండ్లు పుట్టును. అదీ విత్తు నుండే ప్రారంభమగును. అదేవిధంగా ముర్ఖునకు చెడ్డబుద్ధి పుట్టకతోనే వచ్చును.

114.
కపటి వేషమూని కడగండ్లు పడనేల
విపిన భూమి తిరిగి విసుగనేల
యుపముతోనే ముక్తి ఉన్నది చూడరా
విశ్వదాభి రామ వినుర వేమ

తాత్పర్యం: కపట వేషాలు వేసి కష్టాలు పడడం, అడవులకు వెళ్ళి విసుగు పుట్టేలా తిరగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ముక్తిని పొందడానికి ఎన్నో సులభ మార్గాలు ఉన్నాయి. వాటిని ఆచరిస్తే చాలు.

115.
అనువుగాని చోట అధికులమనరాదు
కొంచెముందుటెల్ల కొదువకాదు
కొండ యద్దమందు కొంచమై ఉండదా
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: తగనిచోట తాము గొప్పవారమని చెప్పరాదు. కొంచెం వారైన మాత్రాన హాని లేదు. పెద్దకొండ అద్దంలో చిన్నదిగా కనిపించును కదా.

116.
మనసులోనున్న మర్మమంత ఎరిగి
స్థిరము చేసి ఆత్మ తేటపరిచి
ఘటము నిల్పవలయు, ఘనతలింకేటికి
విశ్వదాభి రామవినురవేమ

తాత్పర్యం:మన మనస్సును మనమే అర్థం చేసుకొని స్థిరపరుచుకుంటే ఆత్మతత్వం బోధపడుతుంది. అలా తెలుసుకున్న వారికి ఇతర గౌరవాలేమీ అక్కర లేదు.

117.
కదలనీయకుండ గట్టిగా లింగంబు
కట్టివేయనేమి ఘనత కలుగు
భావమందు శివుని భావించి కానరా
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: పెద్ద శివలింగాన్ని కదలకుండా మెడలో కట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం లేదు. మనస్ఫూర్తిగా శివుడిని ధ్యానించి సేవిస్తే చాలు.

118.
మేక జంకబెట్టిమెలగుచు మందలో
బ్రమని తిరుగు గొల్ల పగిదిగాను
దేవునెరుగక పరదవేతల దలచు
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం:మేకను చంకలో పెట్టుకొని మందలో వెతికినట్లు, హృదయంలో ఉన్న దేవుడిని గుర్తించకుండా ప్రజలు ఇతర దేవతల కోసం తిరుగుతుంటారు.

119.
తన కుల గోత్రము లాకృతి
తన సంపద కలిమి బలిమి తనకేలనయా?
తన వెంటరావు నిజమిది
తన సత్యమే తోడువచ్చు తనతో
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం:తన కులం, వంశం, రూపం, సంపద, బలం మొదలైనవి తాను చచ్చేటప్పుడు వెంటరావు. సత్యం ఒక్కటే తనతో వస్తుంది. గర్వం వీడి సత్యసంథతతో ప్రవర్తించాలి.

120.
కలిమిగల్గనేమి కరుణ లేకుండిన
కలిమి తగునె దుష్టకర్ములకును
తేనెగూర్పనీగ తెరువున బోవదా
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: సంపద ఉన్నా, జాలి, దయ లేకపోతే ఆ సంపద నశిస్తుంది. తేనేటీగలు కూర్చిన తేనే ఆ ఈగలకు దక్కని విధంగా దుష్టుల సంపదలు కూడా వారికి దక్కవు.

వేమన పద్యములు (101 - 110)

101.
అనువుగాని చోట అధికుల మనరాదు
కొంచెముండుటెల్ల కొదువగాదు
కొండ యద్దమందు కొంచెమై యుండదా
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: అనువుగాని చోట ఎవరూ తమ ఆధిక్యాన్ని చూపడానికి ప్రయత్నించకూడదు. కొద్దిగా తగ్గివున్నా తప్పులేదు. పెద్ద కొండ సైతం అద్దంలో చిన్నది కనిపిస్తుంది. అలాగే సమయం వచ్చే ఆధిక్యాన్ని ప్రదర్శించకుండా ఒదిగి ఉండాలి.

102.
ఇంటి ఇంటిలోననీశ్వరుడుండగ
నంటి చూడలేక యడవులందు
నుంట మేటంచునుందురా జోగులై
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: ఎల్లప్పుడూ ఈశ్వరారాధన చేస్తూ ఉండాలి. అయితే ఈశ్వరుడెవరు, ఎక్కడ ఉంటాడనీ వెతికేందుకు అడవులకు వెళ్లాల్సిన అవసరంలేదు. తనలోనే తత్వం ఉంచితే, ఇంట్లోనే ఈశ్వరుడుంటాడు. అందరిలోనూ ఆ దేవుడు ఉంటాడు.

103.
చిత్తశుద్ధి కలిగిచేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదవగాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంతో
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యం: తాము ప్రబోధించే సంస్కారం చాలా పుణ్యమైంది. దీనిని చిత్తశుద్ధితో చేస్తే సిద్ధించే ఫలితం ఎంత చన్నిదైనా అదేం తక్కువ పనికాదు. చూడ్డానికి మర్రి విత్తనమంత కనిపించినా సారవంతమైన నేలలో నాటితే మర్రి వృక్షంగా రూపొందుతుంది.

104.
అగ్నిబానా మేసి యంబుధి నింకించు
రాముడవలి కేగ రాక, నిలిచి
చెట్లు గిరులు తెచ్చి సేతువు గట్టడా
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: మహిమతో మహాసముద్రాన్ని ఇంకించిన వారైనా సరే మానవ ప్రయత్నంలో సేతువు కట్టందే ఆ దరి చేరుకోలేరు. పూజవల్ల కాదు, పూనుకవల్ల ఏదైనా నెరవేరుతుంది.

105.
ఐదు వేళ్లు బలిమి హస్తంబు పనిచేయు
నం దొకండు విడ్డ పొందు చెడును
స్వీయుడొకడు విడిన జెడుకదా పనిబల్మి
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: కలసికట్టుగా ఉంటే ఎలాంటి కార్యాన్నైనా సాధించవచ్చు. అయిదు వేళ్లు కలిపితే చేయి మరింత బలంగా మారుతుంది. కుటుంబంలోను, కులం, వర్గంలోనూ, అందరూ సయోధ్యగా ఉంటేనే పనులు జరుగుతాయి.

106.
ఆత్మబుద్ధి వలన నఖిలంబ తానయ్యె
జీవబుద్ధి వలన జీవుడయ్యె
మోహబుద్ధిలయము ముందర గనుగొను
విశ్వదాభిరామ వినురమేమ!

తాత్పర్యం: ఆత్మ అంతా తానే అయినా జీవిస్తూ ఉండడంవల్ల వల్ల జీవుడయ్యాడు. జీవుడికి సహజమైన మోహాలు లోభాలు సహజం. వయస్సు ముదురుతన్న కొద్దీ మోహం ఎక్కువ అవుతుంది.

107.
గుణములోగలవాని కులమెంచగానేల
గుణము కలిగెనేని కోటిసేయు
గణములేక యున్న గుడ్డిగవ్వయులేదు
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: గుణవంతుడి కులాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ధనవంతుడు కాకపోయినా గుణం ఉంటే చాలు. గుణహీనుడు చిల్లిగవ్వ విలువ కూడా చేయడు.

108.
తల్లితండ్రులందు దయలేని పుత్రుండు
పుట్టనేమి? వాడు గిట్టనేమి?
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: జన్మనిచ్చినవారిపై జాలీ, ప్రేమ లేనివాడు పుట్టినా ఒక్కటే, చచ్చినా ఒక్కటే. వాడి బతుకు పుట్టలోని చెదల వంటిది. అవి పుడితే ఎంత? చస్తే ఎంత?

109.
కోపమున ఘనత కొంచెమైపోవును
కోపమునను గుణము కొరతపడును
కోపమణచనేని కోరికలీడేరు
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: కోపం వల్ల మనిషి తన కీర్తిని తానే తగ్గించుకుంటాడు. ఉన్న కొద్ది సుగుణం కోపం వల్ల తక్కువైపోతుంది. కోపాన్ని అణుచుకుంటే లక్ష్యాల సాధన సులభమవుతుంది. అందుకే శాంతమే శ్రీరామరక్ష.

110.
ఎలుగు తోలు తెచ్చి ఏడాది యుతికినా
నలుపు నలుపేకాని తెలుపుకాదు
కొయ్యబొమ్మ తెచ్చి కొట్టితే గుణియోనె
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: ఎలుగుబంటి తోలును ఎన్నాళ్ళు ఉతికినా రంగు అలాగే ఉంటుంది తప్ప తెలుపుగా ఎట్టి పరిస్థితుల్లోను మారదు. కొయ్యబొమ్మను తీసుకువచ్చి ఎంతకొట్టినా దానికి సుగుణాలు అలవాటుకావు. అదేవిధంగా మూర్ఖుడికి ఎంత బోధించినా జ్ఞానం తలకెక్కదు.

వేమన పద్యములు (91 - 100)

91.
మాటజెప్ప వినని మనుజుడు మూర్ఖుడు
మాట విన్న నరుడు మానుడగును
మాట వినగ జెప్ప మానుట కూడదు
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: ఎదుటివాడు చెప్పే మాటల్లోని మంచి చెడ్డలను తెలుసుకోలేని వాడు మూర్ఖుడు. అందరి మాటలను ఆలకించేవాడు ఉత్తముడు. మాటలు విన్న తర్వాత మంచిచెడులను ఆలోచించి సమాధానం చెప్పకపోవడం కూడా సమంజసం కాదు.

92.
మనసు తెలిసి యొకని మాటకు బ్రతిచెప్ప
సంతసించు నతడు చాలమెచ్చు
మనసు దెలియకున్నడనియుచు ననునేదో
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: మనసు కనిపెట్టి మాట్లాడితే ఎంతటి వారైనా మెచ్చుకుంటారు. మనసు తెలుసుకోకుండా మాట్లాడితే ఎదుటివాళ్ళు కోపగించుకునే అవకాశం ఉంది. లేదా వ్యతిరేకంగా మాట్లాడతారు.

93.
ఆలిమాటలు విని అన్నదమ్ముల రోసి
వేరేపోవువాడు వెర్రివాడు
కుక్కతోక పట్టి గోదారీదినా?
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యం: భార్య మాటలు విని అన్నదమ్ములను ఏవగించుకొని వేరింటి కాపురం పెట్టడం వెర్రితనం. ఇది కుక్కతోక పట్టుకొని గోదారి ఈదడం వంటిది.

94.
జ్ఞానియైనవాని మానక పూజించు
మనుజుడెప్పుడు పరమునను ముదంబు
సుఖమునందుచుండుసూరులు మెచ్చగ
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: జ్ఞానిని గుర్తించి ఎప్పుడు పూజించాలి. పుణ్యాత్ముడు భువిలోను, దివిలోను సమస్త సుఖములను అనుభవిస్తాడు.

95.
హాని కలుగబోదు హరిమది నెంచెడు
వాని కబ్దు పరము వసుధయందు
పూని నిష్ఠమీరి పొదలక యుండుము
విశ్వరాభిరామ వినురవేమ!

తాత్పర్యం: భగవంతుడిని మనస్సులో ధ్యానించే వారికి ఎలాంటి హాని జరగదు. అతడికి తప్పక ముక్తి లభిస్తుంది. అందుకే నిష్ఠతో దేవుడిని ధ్యానించి నిశ్చలంగా జీవించాలి.

96.
అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచు మోగినట్లు కనకంబు మోగునా
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యం: అల్పుడెప్పుడు మాట్లాడినా ఆడంబరంగానే ఉంటుంది. అదే సజ్జనుడు మాట్లాడితే చల్లగా నిరాడంబరంగా ఉంటుంది. కంగున మోగి విలువలేని ఇత్తడిలాగా అనవసరమైన హడావిడి చేసేవారు అల్పులు. శబ్దం రాకపోయినా బంగారం లాగా విలువైన వాడు సజ్జనుడు.

97.
న్యాయశాస్త్ర మరయ నన్యాయమున దించు
ధర్మశాస్త్ర మొసగు రుగ్మతంబు
జ్యోతిషము జనముల నీతుల దప్పించు
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: జాతకాలు, ముహూర్తాలు, శుభలగ్నాలు మొదలైనవి వేలం వెర్రిగా పిరణమించాయి. న్యాయం అన్యాయమవుతోంది. శాస్త్రోక్తమైన శుభలగ్నాలు పెట్టినా అవి అప్పుడప్పుడు అశుభాలుగానే మారుతున్నాయి.

98.
దేవుడనగ వేరే దేశముందున్నాడె
దేహితోడ నెపుడు దేహమందె
వాహనములనెక్కి పడిదోలుచున్నాడు
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం:మన ఇంద్రియాలను నడిపించే జీవ చైతన్యమే దేవుడు. ఆ దేవ చోదితుడైన నరుడు తన వాళ్లకోసం పాటుపడాలి. భూమిలోన బుట్టు భూసారమెల్లను

99.
తనువులోన బుట్టు తత్త్వమెల్ల
శ్రమలోన బుట్టు సర్వంబు తానౌను
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: ఈ ప్రపంచం నుంచే సమస్త చరాచర జీవకోటి జన్మిస్తుంది. మానవుడి ఉనికిలో నుంచే చైతన్యం ఉద్భవిస్తుంది. శ్రమలో నుంచే సర్వం ఉత్పన్నమవుతుంది. శ్రమించనిదే సృష్టిసాగదు. శ్రమంలో నుంచే సంపద వస్తుంది.

100.
వ్రాతకంటె హెచ్చు పరమీదు దైవంబు
చేతకంటె హెచ్చు వ్రాత లేదు
వ్రాత కజుడు కర్త చేతకు దాకర్త
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: చేసుకున్న దానికన్నా చిన్నమెత్తు దేవుడు కూడా ఇవ్వలేడు. దీనినే లోకులు బ్రహ్మవాతలంటారు. తల వ్రాతకు బ్రహ్మదేవుడు కర్త కావచ్చు గానీ, తన చేతకు నరుడు తానే కర్త.

వేమన పద్యములు (81 - 90)

81.
నీతి జ్యోతిలేక నిర్మలంబగు నేది
ఎట్లు కలగుబర మదెంతయైన
ధనము గలిగియున్న దైవంబు గలుగదు
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యం: నీతి అనే దీపం సహాయం లేకపోతే అజ్ఞానాంధకారం నశించదు. అది లేకపోతే బ్రహ్మస్వరూపం కనిపించదు. ధనం ఉన్నంత మాత్రాన దైవ కృప ఉండదు.

82.
పగయుడగు గోపముడిగిన
పగయుడుగన్‌ కోర్కెలుడుగు బరజన్మంపుం
దగులుడుగు భేదముడిగిన
త్రిగుణము లుడుగంగ ముక్తి స్థిరమగు వేమా!

తాత్పర్యం: కోపం నశిస్తే పగ పోతుంది. పగ పోతే కోరికలు ఉండవు. భేదభావాలు లేకపోతే మరో జన్మ లేదు. త్రిగుణాలు నశిస్తే ముక్తి కచ్చితంగా లభిస్తుంది.

83.
పప్పులేని కూడు పరులకోసహ్యమే
యుప్పులేని వాడె యధిక బలుడు
ముప్పులేని వాడు మొదటి సుజ్జానిరా
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: పప్పులేని భోజనము రుచించదు. అప్పులేని వాడే గొప్పవాడు. భోగాభాగ్యాలపై ఆశలేని వాడే జ్ఞాని.

84.
నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాలు తట్టెడేల
చదువ పద్యమరయ జాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యం: విలువైన నీలమణి ఒక్కటి చాలు. విలువలేని మెరుగురాళ్లు తట్ట నిండా ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు. అలాగే చెత్త పద్యాలు వేల సంఖ్యలో ఉన్నా ఉపయోగం లేదు. రసవంతమైన పద్యం ఒక్కటైనా చాలు.

85.
పరుల దత్తమొప్పి పాలనచేసిన
నిల స్వదత్తమునకు విను మడియగు
నవని పరుల దత్త మహపరింపగ రాదు
విశ్వధాబిరామ వినురవేమ!

తాత్పర్యం: పరులు ఇచ్చిన దానాన్ని సక్రమంగా ఉపయోగిస్తే దానివల్ల తాను ఇచ్చిన దానం కంటే రెండురెట్ల ఫలం దక్కుతుంది. పరుల సొమ్ము అపహరించడం నీచమైన పని.

86.
నిజములాడు వాని నిందించు జగమెల్ల
నిజము బల్కరాదు నీచులకడ
నిజ మహాత్ముగూడ నిజమాడవలయురా
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యం: చెడ్డవారితో నిజం చెప్పకూడదు. వారు నిజం చెబితే నమ్మరు. పైగా నిందిస్తారు. ఉత్తముల దగ్గర మాత్రం కచ్చితంగా నిజాన్నే చెప్పాలి.

87.
పదుగురాడుమాట పాడియై ధరజెల్లు
నొక్కడాడుమాట యెక్కదెందు
వూరకుండు వాని కూరెల్ల నోపదు
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: పదిమంది చెప్పిన మాట అసత్యమైన కూడా అదే న్యాయంగా చెల్లుతుంది. ఒక్కడే నిజం చెప్పినా నమ్మరు. వాగ్వివాదాలు జరిగే సమయంలో మౌనంగా ఉండేవాడే ఉత్తముడు.

88.
పరుల మేలు చూచి పలుగాకి వలె నెప్పు
వట్టి మాటలాడు వాడధముడు
అట్టి వాని బ్రతుకు టదియేల మంటికా
విశ్వధాబిరామ వినురవేమ!

తాత్పర్యం: పరుల మేలు చూసి ఓర్చుకోలేని వాడు అధముడు. ఇతరుల శ్రేయస్సును చూసి ఆనందించాలే తప్ప అసూయపడకూడదు. అలా అసూయపడే వాళ్ల బతుకు నిష్ప్రయోజనం.

89.
భయమంతయు దేహమునకె
భయ ముడిగిన నిశ్చయంబు పరమాత్మునకే
లయమంతయు జీవునకే
జయమాత్మకు ననుచు జగతిఁ జాటుర వేమా

తాత్పర్యం:సంశయం, భయం అన్నీ శరీరానికే. వాటిని విడిచి పెడితే ఆత్మ సాక్షాత్కారమవుతుంది. లయము పొందేది జీవుడే. ఆత్మ నిత్యమైనది. దానినెప్పుడు విజయం వరిస్తుంటుంది.

90.
భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దాన హీనుఁ జూచి ధనము నవ్వు
కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: శాశ్వతంగా భూమిపై జీవించలేని మానవుడు ఈ భూమి నాది... నాది అంటే భూమి నవ్వుతుంది.దానం చేయని వాడిని చూసి ధనం నవ్వుతుంది. యుద్ధమంటే పారిపోయే వాడిని చూసి యముడు కూడా నవ్వుతాడు.

వేమన పద్యములు (71 - 80)

71.
తామసించి చేయదగదెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమగును
పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనా?
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: ఏ పని అయినా తొందరపడి చేయడం మంచి విధానం కాదు. తొందరపడడం వల్ల పని చెడుతుంది ఫలితం రాదు. పచ్చికాయ తెచ్చి ముగ్గపెట్టినంత మాత్రాన అది పండు కాదు కదా!

72.
తల్లీ బిడ్డలకు తగవు పుట్టించెడి
ధనము సుఖము గూర్చునని గడింత్రు
కానీయెల్ల యెడల ఘన దుఃఖకరమది
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: ధనము బాగా ఉంటే ఎక్కువ సుఖపడవచ్చనుకుని దాన్ని అష్టకష్టాలు పడి సంపాదిస్తారు. కానీ ధనము ఎల్లప్పుడూ దుఃఖమే కలిగించును కానీ దీనివల్ల నిజమైన ఆనందాన్ని పొందలేము. ధనం తల్లీబిడ్డల మధ్య కూడా తగవులు తెస్తుంది.

73.
దొంగమాటలాడ దొరుకునె మోక్షము
చేతగాని పలుకు చేటుదెచ్చు
గురువుపద్దు కాదు గునహైన్య మదియగు
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం:గురువులమని చెప్పి దొంగ మాటలు చెప్పినంతమాత్రాన ముక్తి లభించదు. చేతగాని మాటల వల్ల చేటు కలుగుతుంది. హీనమైన గుణాలుండడం గురువు లక్షణం కాదు.

74.
నలుగురు కల చోటను దా
దల చూపుచు మెలగుచుండి ధన్యాత గనగా
దలచెడి యాతడు నిచ్చలు
గల మాటలే పలుకుచుండగా దగు వేమా!

తాత్పర్యం:నలుగురిలో మర్యాదగా తిరగాలనుకునేవాడు ఎల్లప్పుడు యథార్ధాన్నే పలకాలి. అప్పుడే అతన్ని అందరూ గౌరవిస్తారు.

75.
నడుచునిచ్చు నతని బత్తెమిచ్చిన వాని
కడుపు చల్లజేసి ఘనత విడుచు
నడుప నేర నేర నతడు నాలి ముచ్చేగదా
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: కన్యాదానం చేసినవారిని, అన్నం పెట్టిన వారిని ఎల్లప్పుడూ గౌరవంతో చూడాలి. వారికి తగిన మర్యాద ఇవ్వనివాడు దుష్టుడితో సమానం.

76.
పదుగురాడుమాట పాడియై ధరజెల్లు
నొక్కడాడుమాట యెక్కదెందు
వూరకుండు వాని కూరెల్ల నోపదు
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: పదిమంది చెప్పిన మాట అసత్యమైన కూడా అదే న్యాయంగా చెల్లుతుంది. ఒక్కడే నిజం చెప్పినా నమ్మరు. వాగ్వివాదాలు జరిగే సమయంలో మౌనంగా ఉండేవాడే ఉత్తముడు.

77.
పతక మందు నొప్పు పలు రత్నముల పెంపు
బంగరందు కూర్ప బరువు గనును
గాని యితర లోహమైన హీనము గాదె
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:రత్నాల అందం బంగారు అభరణాల్లో పొదిగితేనే తెలుస్తుంది. ఇతర లోహాల్లో అమర్చితే ఎంతమాత్రం శోభను చేకూర్చదు. మంచివాళ్లకు చెడ్డవారికి కూడా భేదం ఇలాగే ఉంటుంది.

78.
జన్నములను మరియు జన్నియల ననేక
ముల నొనర్చియున్న ఫలముకాన
రాక యుండు నీతి లేకున్న మాత్రాన
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: మనిషిలో నీతి లేకుండా ఎన్ని యజ్ఞాలు, వ్రతాలు చేసినా ప్రయోజనం ఉండదు.

79.
తప్పు పలుకు పలికి తాతోట చేసిన
కూడియున లక్ష్మీ క్రుంగిపోవు
నోటికుండ నీళ్ళు నొనరగా నిలుచునా
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం:అబద్దాలు ఆడితే కూడబెట్టిన ధనం కరిగిపోతుంది. అసత్యం పలికేవారిని లక్ష్మీదేవి విడిచి పెడుతుంది. చిల్లికుండలో నీళ్లు నిలబడని రీతిలో అవాస్తవాలు చెప్పేవాడి నుంచి ధనం వెళ్లిపోతుంది.

80.
భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దాన హీనుఁ జూచి ధనము నవ్వు
కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: శాశ్వతంగా భూమిపై జీవించలేని మానవుడు ఈ భూమి నాది... నాది అంటే భూమి నవ్వుతుంది.దానం చేయని వాడిని చూసి ధనం నవ్వుతుంది. యుద్ధమంటే పారిపోయే వాడిని చూసి యముడు కూడా నవ్వుతాడు.

వేమన పద్యములు (61 - 70)

61.
నిజము తెలిసియున్న సుజినుడానిజమునె
పలుకవలయుగాని పరులకొరకు
చావకూడ దింక నోపదవ్యం పల్క
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: తనకు నిజము తెలిసిఉన్నచో నిజాన్నే చెప్పాలితప్ప అసత్యాన్ని చెప్పరాదు. నిజాన్ని ఎంతమాత్రమూ దాచకూడదు.

62.
తామును జనులేమను కొన
బూనుదురో దాని సరసి పొందిన జడనీ,
రాని పధంబున నడిచిన
దాననె ధర్మాత్ముడండ్రు తన్నిట వేమా!

తాత్పర్యం: జనులు తనను నిందింపని రీతిలో నడవడిక కలిగిన వ్యక్తి, తన ప్రవర్తనను ప్రజలు మెచ్చుకొనునట్లు ప్రవర్తించువాడే నిజమైన ధర్మాత్ముడు.

63.
వినియు వినకయుండు కనియు గనక యుండు
తలచి తలపకుండు తాను యోగి
మనుజవరులచేత మణిపూజ గొనుచుండు
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:జ్ఞాని, మోక్ష ధర్మములు వినియు విననట్లును, తత్వమును చూచిచు చూడనట్లును, దేవుని తలచియు తలపనట్లు ఉండును. అట్టి
జ్ఞానిని అందరూ పూజిస్తారు.

64.
వెన్న చేతబట్టి వివరంబు తెలియక
ఘృతము కోరునట్టి యతని భండి
తాను దైవమయ్యు దైవంబు దలచును
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: వెన్నను చేతలో పట్టుకుని నెయ్యి చేసే విధానము తెలియక నేతికై బాధపడే వానివలె, జనుడు తనలోనే భగవంతుడున్నాడని తెలుసుకోలేక అతనెక్కడో ఉన్నాడని వెదకుచూ తికమక పడుతుంటాడు.

65.
రూపువంక పేరు రూఢిగా నిలుచును
పేరువంక క్రియలు పెనగుచుండు
నాశమౌను తుదకు నామరూప క్రియల్‌
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: మానసిక ధ్యానంవలన దివ్యత్వమును పొందవచ్చును. కానీ, ఏదో ఒక రూపం నిర్మించి పేరుపెట్టి, ఆర్భాటంగా పూజలు చేస్తే లాభంలేదు.

66.
లోభమోహములను ప్రాభవములు తప్పు
తలచిన పనులెల్ల తప్పి చనును
తానొకటి దలచిన దైవమొండగుచుండు
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: లోభము, మోహము కలవారికి గొప్పతనము దక్కదు. అట్టివారు తలచిన పనులు జరగవు. తానొకటి తలచిన, దైవమొకటి తలచుననుట ఎరిగినదే కదా!

67.
శాంతమే జనులను జయమునొందించును
శాంతముననె గురువు జాడ తెలియు
శాంత భావ మహిమ జర్చింపలేమయా
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:శాంత స్వభావం ఉంటే దేనినైనా సాధించవచ్చు. శాంతంతోనే గురువులు గొప్పవారయ్యారు. శాంత గుణం మహిమను వర్ణించలేము.

68.
వేషధారినెపుడు విశ్వసింపగరాదు
వేషదోషములొక విధయె యగును
రట్టుకాదె మునుపు రావణు వేషంబు
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: వేషం వేసి నటించడం కూడా మోసం చేయడమే. అలాంటి వారిని నమ్మకూడదు. రావణుడంతటి గొప్పవాడు కూడా వేషం వేసి సీతను అపహరించి అపకీర్తి పాలయ్యాడు.

69.
ఇంగలంబు తోడ నిల సల్పుతోడను
పరుని యాలితోడ పతితుతోడ
సరసమాడుటెల్ల చావుకు మూలము
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: నిప్పుతోను, నీచుడితోనూ, పాపాత్ముడితోను, పరస్త్రీ తోనూ పరిహాసమాడడం తన ప్రాణానికి హాని కలిగిస్తుంది.

70.
ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు
దాని బలిమి నెంతయైన గూడు
గడ్డి వెంట బెట్టి కట్టరా యేనుంగు
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: ఐకమత్యం ఎంతో ముఖ్యమైనది. దానిలో ఎంతో బలం ఉంది. గడ్డి పరకలను ఒక్కటిగా చేర్చి ఏనుగును కూడా బంధించవచ్చు. ఐకమత్యంగా ఉంటే ఎంతని కార్యాన్నయినా సాధించవచ్చు.

వేమన పద్యములు (51 - 60)

51.
ఆశయనెడు దాని గోసివేయగాలేక
మొహబుద్ది వలన మునుగువారు
కాశివాసులైన గనబోరు మోక్షము
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: ఆశకు లొంగిపోయి అల్లాడేవారు, భోగభాగ్యాల మోహంలో మునిగి తేలేవారు మోక్షాన్ని పొందలేరు. ఇలాంటివారు పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో నివశించినా ముక్తిని పొందలేరు.

52.
చిత్తమనేడి వేరే శిథిలమైనప్పుడే
ప్రకృతి యనెడి చెట్టు పడును పిదప
గోర్కులనెడి పెద్దకొమ్మలెండును గదా
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: మనసు అనెడి వేరు తెగితేనేగాని, మాయ అనెడి వృక్షం నశించదు. అప్పుడే ఆశలనెడి కొమ్మలెండిపోయి ముక్తిని పొందవీలగును.

53.
భోగంబుల కాశింపక
రాగద్వేషంబు రంగుడదమలో
వేగమె మోక్ష పదంబును
రాగను నాతండు యోగిరాయుడు వేమా!

తాత్పర్యం:సుఖముల నాశింపక, రాగ ద్వేషాదులను విడిచిపెట్టిన వానికి శ్రీఘ్ర ముగనే ముక్తి కలుగును. అట్టివాడే యోగీశ్వరుడని చెప్పదగును.

54.
చనువారెల్లను జనులం
జనిపోయిన వారి పుణ్య సత్కథలెల్లన్‌
వినవలె గనవలె మనవలె
నని మషులకు దెలుసగూడ దంత్యము వేమా!

తాత్పర్యం:చనిపోయిన యుత్తముల చరిత్రలను శ్రద్ధగా విని, వారివలనే నడుచుకొనుచు ముక్తిని యత్నించవలెను. తయ యంత్యములను గూర్చి ఎవ్వరికిని తెలుపగూడదు.

55.
ఆశయనెడి త్రాళ్ళ నఖిల జనంబులు
కట్టుపడుచు ముక్తిగానరైరి
జ్ఞానఖడ్గమునను ఖండింప రాదొకో
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: ఆలు, కోరికలతో బంధితులైన ప్రజలు మోక్షాన్ని పొందలేకపోతున్నారు. ఈ కోర్కెలను, ఆశలను అణచివేసేందుకు జ్ఞానమనే ఖడ్గం కావాలి. అందుకే జ్ఞానాన్ని అందరూ ఆర్జించాలి.

56.
అతిథి రాక చూచి యదలించి పడవైచి
కఠిన చితులగుచు గానలేరు
కర్మమునకు ముందు ధర్మము గానరో
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: అతిథి ఇంటికి రాగానే అతనిని అదిలించి పొమ్మని చెప్పిన కఠినచిత్తులు ధర్మమును గుర్తింపరు.ధర్మము చేసిననే కర్మములు నశించగలవు

57.
తను వలచిన దావలచును తను
వలవక యున్ననెనడు తావలవ డిలన్‌
తనదు పటాటోపంబులు తన
మాయలు పనికిరావు ధరలోన వేమా!

తాత్పర్యం: తాను ఇతరులను ప్రేమిస్తే తనని వారు ప్రేమిస్తారు. తాను ప్రేమించకుంటే వారు కూడా ప్రేమించరు. మాయలు పన్ని మోసాలు చేస్తే ఎవ్వరు కూడా ప్రేమించరు.

58.
మాటలాడ వచ్చు మనసు నిల్వగలేదు
తెలుపవచ్చు దన్ను తెలియలేదు
సురియబట్టవచ్చు శూరుడు కాలేడు
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: మనిషి ఎన్నిమాటలైనా చెప్పగలడుకాని, తాను చెప్పినట్లు నడుచుకోలేడు. ఒకరికి చెప్పుటలో ఉన్నంత ఉత్సాహం తననుతాను గుర్తించడంలో ఉండదు. ఆయుధము పట్టిన ప్రతివాడు శూరుడు కాలేదుకదా!

59.
తనకేనాడు సుభిక్షము
తనకేనాడును భగంబు తనరవయునం
చును తన దశకై యెల్లెడ
మనసందున జివుకుచుండు మహిలో వేమా!

తాత్పర్యం: తనకెల్లప్పుడు సిరిసంపదలుండవలెననీ, భోగభాగ్యాలు ఉండాలని నరుడు ఆశలోనే మనసు నుంచి చివుకుచుండును. ఆశవల్ల మిగిలేది బాధే!

60.
ఎండిన మా నొకటడవిని
మండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్లన్‌
దండిగల వంశమెల్లను
చండాలుండొకడు పుట్టి చదుపును వేమా!

తాత్పర్యం: ఎండిన మ్రాను అడవిలో ఉన్నచో అందుకు పుట్టిన అగ్ని వనమునంతయున కాల్చును. వంశములో ఒక నీచుడు పుట్టి ఆ వంశమునంతను నశింపజేయును.

వేమన పద్యములు (41 - 50)

41.
పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల
పుట్టి గిట్టలేదె పూర్వులెవరు
పుట్టి గిట్టుటెల్ల వట్టి భ్రాంతులు సుమీ,
విశ్వదాభిరామ వినుర వేమా!

తాత్పర్యం: పుట్టిన వారికి చావు తప్పదు. చావక బతికి ఉన్నవారు ఎవరూ లేరు. చావు, పుట్టుకలు భ్రాంతులు. అందుకే పుట్టుకపై ఆశతో భోగభాగ్యాలపై లాలసత్వం పెంచుకోకూడదు. చచ్చిపోతామనే భయంతో నిత్యం ఆవేదన చెందకూడదు.

42.
పెట్టిపోయలేని వట్టి దేబెలు భూమి
బుట్టిరేమి వారు గిట్టరేమి
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా!
విశ్వదాభిరామ వినుర వేమా!

తాత్పర్యం: సక్రమంగా పెంచి పోషించలేని పిసినారులు, ఇతరులకు ఏ మాత్రం సాయం చేయనివారు బతికి ఉన్నా... చచ్చినా ఒక్కటే. పుట్టలో చెదలు పుడుతూ ఉంటాయి. చస్తూ ఉంటాయి. అవి పుట్టినా, చచ్చినా ఎలాంటి ప్రయోజనం, ఫలితం ఉండదు. పిసినారులు కూడా అలాంటి చెదలతోనే సమానం.

43.
లోకమందుబుట్టి లోకమందె పెరిగి
లోక విభవమోర్వలేక జనుడు
లోకమందు జనికి లోబడి చెడిపోవును
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: భూమిమీదే పుట్టి పెరిగి పెద్దయిన మానవుడు భూమిమీద వృద్ధి చెందిన సంపదలకు తాను సృష్టించిన సొమ్ముకు భోగభాగ్యాలకు దాసోహమై చెడిపోతున్నాడు.

44.
మది గలిగిన పూజ మదనారి మెచ్చును
మనసు నిల్సినంత మహితుడగును
మనసులేని పూజ మట్టి సమానము
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: చిత్తశుద్ధితో పూజిస్తే దేవుడు మెచ్చి వరాలు అందిస్తాడు. మనస్సు నిల్పి చేయని పూజ నిరర్థకము. నిలకడైన మనస్సుతో దేవుడిని పూజిస్తేనే సరైన పరమార్థం చేకూరుతుంది.

45.
తామును జనులేమను కొన
బూనుదురో దాని సరసి పొందిన జడనీ,
రాని పధంబున నడిచిన
దాననె ధర్మాత్ముడండ్రు తన్నిట వేమా!

తాత్పర్యం: జనులు తనను నిందింపని రీతిలో నడవడిక కలిగిన వ్యక్తి, తన ప్రవర్తనను ప్రజలు మెచ్చుకొనునట్లు ప్రవర్తించువాడే నిజమైన ధర్మాత్ముడు.

46.
మదము వలన గలుగు మాటలు మఱిపల్కి
మ్రుచ్చు సద్దులనొగి మోసపుచ్చి
కాసురాబెనగెడు కష్ఠుండు గురుడౌనే?
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: అబద్ధాలతో నిత్యం అందరినీ నమ్మించి మోసంతో సొమ్ము సంపాదించే దుష్టబుద్ధి కలవాడు ఎప్పటికీ గురువు కాలేడు.

47.
మనసే మాయా మృగమౌ
మననేమిటి పైకిగానీ మణిపోనీకా
మనసున మనసును జంపిన
మనందే ముక్తిగలదు మహిలో వేమా!

తాత్పర్యం: మనసు ఒక మాయా మృగం. అన్నింటిపై ఆశపడుతుంటుంది. మనసును దుష్ట కర్మలవైపు మళ్లనీయకూడదు. మనస్సులో పుట్టే వికారాలను అణచివేసే వారికి ముక్తి, ప్రశాంతత మనస్సులోనే లభిస్తుంది.

48.
మంత్రమొకటి చెప్పి మఱి దేవతార్చన
చేసి తమకుగరుణచెందినదని
వేదపఠన చేసి వెఱ్ఱులై పోదురు,
విశ్వదాభిరామవినుర వేమా!

తాత్పర్యం: మానవులు మంత్రాలు చదివి, దేవతలనుపూజిస్తూ తాము పుణ్యాత్ములం అయిపోయామని గొప్పగా భావిస్తారు. నిజమైన దయాగుణం కలవారు, పుణ్యాత్ములు ఇలా విర్రవీగరు.

49.
మఠములోనియోగి మాయలన్నియుగోసి
ఘటములోన నున్న ఘనునిదెలిసి
మాట మాటకుగురు మరువక తెలుపురా,
విశ్వదాభిరామ వినుర వేమా!

తాత్పర్యం: నిజమైన యోగి గ్రామంలో ఉండకుండా మఠంలో నివసిస్తాడు. మాయలు, వ్యామోహాలకు అతీతుడై గురువాక్యమును, భగవంతుడిని నిత్యం ధ్యానిస్తూ ఉంటాడు.

50.
తిరిగి వచ్చువేళ మరలిపోయెడి వేళ
వెంట దేరు ధనము వంటబోరు
తొనెటకు జనునొ ధనమెందు బోవునో
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: జనులు పుట్టినపుడు ధనాన్ని తీసుకొనిరారు. మరణించినపుడు వెంట తీసుకుపోలేరు. ధనానికి తనకు ఎటువంటి సంబంధము లేదు. కావున ధనంపై కోరిక తగదు.

వేమన పద్యములు (31 - 40)

31.
పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల
పుట్టి గిట్టలేదె పూర్వులెవరు
పుట్టి గిట్టుటెల్ల వట్టి భ్రాంతులు సుమీ,
విశ్వదాభిరామ వినుర వేమా!

తాత్పర్యం: పుట్టిన వారికి చావు తప్పదు. చావక బతికి ఉన్నవారు ఎవరూ లేరు. చావు, పుట్టుకలు భ్రాంతులు. అందుకే పుట్టుకపై ఆశతో భోగభాగ్యాలపై లాలసత్వం పెంచుకోకూడదు. చచ్చిపోతామనే భయంతో నిత్యం ఆవేదన చెందకూడదు.

32.
పరుల విత్తమందు భ్రాంతి వాసినయట్టి
పురుషుడవనిలోన పుణ్యమూర్తి
పరుల విత్తమరయ పాపసంచితమగు
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: పరుల ధనంపై ఆశ లేనివాడే పురుషుల్లో ఉత్తముడు. పరుల సొమ్ము తీసుకున్నా, అది పాపంతో సంపాదించినదే అవుతుంది. అలా చేసేవాడికి ముక్తి ఉండదు.

33.
పరధనంబులకును ప్రాణములిచ్చును
సత్యమంతలేక జారడగును
ద్విజులమంచు నింత్రుతేజమించుకలేదు
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: ఈ కాలపు బ్రాహ్మణులు పరుల ధనాన్ని ఆశిస్తున్నారు. ప్రాణాల కంటే దానమే గొప్పదంటున్నారు. జ్ఞానం లేకపోయినా అందరికంటే తామే గొప్ప అని అపోహ పడుతున్నారు.

34.
నోరు పలకవచ్చు నుడి వ్రాయగరాదు
వ్రాతకన్న సాక్షి వలవదన్న
పరగలేని వ్రాత భంగ పాటుందెచ్చు
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: ఎన్ని మాటలైనా చెప్పవచ్చు కానీ రాసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటలకన్నా రాత గొప్ప సాక్ష్యం. అవాస్తవాలను, కల్పితాలను రాయడం వల్ల మోసమే జరుగుతుంది.

35.
నిజమాకల్ల రెండు నీలకంఠుడెఱుంగు
నిజములాడకున్న నీతిదప్పు
నిజములాడునపుడు నీ రూపమనవచ్చు
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: వాస్తవాలు, అవాస్తవాలు దేవుడికి తెలుస్తాయి. అందుకే ఎప్పుడూ నిజం మాట్లాడాలి. నీతిని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. నిజం చెప్పేవారిని పరమేశ్వర స్వరూపమే అనవచ్చు. నిజాలు చెబితేనే మన వ్యక్తిత్వం సంపూర్ణంగా ఆవిష్కృతమవుతుంది.

36.
దశగలారినెల్ల దమ బంధువు లటండ్రు
దశయలేమి నెంత్రు తక్కువగను
దశయన గమ ధన దశమొక్కటే దశ
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: ఎవరి దగ్గరైనా ధనం ఉంటేనే వారిని తమ వారని చెప్పుకోడానికి ఇష్టపడతారు. డబ్బు లేకపోతే ఎంత మంచివారినైనా తమ బంధువులని చెప్పుకోరు. మనుషుల మంచితనానికంటే డబ్బుకే విలువఇస్తారు. ధనం ఉంటేనే అదృష్టం అని భావిస్తారు.

37.
తామసించి చేయదగ దెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమగును
పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనే
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: తొందరపడి ఆవేశంతో ఏ పని చేయకూడదు. తొందరపాటువల్ల ఆ పని ప్రతికూల ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. పచ్చికాయ తొందరపాటుతనంతో తెచ్చి మగ్గపెట్టినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అది పండుగా మారదు. చివరికి తినడానికి కూడా పనికిరాకుండా పోతుంది.

38.
తల్లిబిడ్డలకును తగవు పుట్టించెడి
ధనము సుఖము గూర్చునని గడింత్రు
కాని యెల్లయెడల ఘన దుఃఖన్‌దమది
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: ధనం వల్ల సుఖం పొందవచ్చని అందరూ పిచ్చిగా సంపాదిస్తుంటారు. అధికమైన సొమ్ము ఎప్పటికైనా దుఃఖాన్నే కలిగిస్తుంది. సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలనే అశాంతితోనే అల్లాడుతుంటారు. అత్యంత ప్రేమానురాగాల్లో ఉండే తల్లికి పిల్లలకు మధ్య కూడా ధనం విరోదం తెస్తుంది.

39.
తల్లిదండ్రులెన్నదగు తొలి గురువులు
పార్వతీభవు లిలబరమగురులు
కూలివాండ్ర జగతి గురులన ద్రోహము
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం:తల్లిదండ్రేలే అందరికీ మొదటి గురువులు. పార్వతీ పరమేశ్వరులు పరమగురువులు. డబ్బు తీసుకొని బోధించే వారు అసలు గురువులే కాదు. అలా వారిని గురువులనడం ద్రోహమే అవుతుంది.

40.
తామసించి చేయదగ దెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమగును
పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనే
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: తొందరపడి ఆవేశంతో ఏ పని చేయకూడదు. తొందరపాటువల్ల ఆ పని ప్రతికూల ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. పచ్చికాయ తొందరపాటుతనంతో తెచ్చి మగ్గపెట్టినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అది పండుగా మారదు. చివరికి తినడానికి కూడా పనికిరాకుండా పోతుంది.

వేమన పద్యములు (21 - 30)

21.
నీవనినను నేననినను
భావమ్మున నెఱుకయొక్క పద్ధతియగునా
భావంబు దెలిసి మదిని
ర్భావముగా నిన్ను గనుట పరమగు వేమా

తాత్పర్యం: నీవు-నేను అని వాదులాడుట జనుల పద్ధతి కాదు. భగవంతుని తత్త్వమెరిగి నిర్భావంగా ధ్యానం చేయుటయే పరము పొందుటకు తగిన సాధనము.

22.
నీళ్ల మునుగునేల? నిధుల మెట్టగనేల
మొనసి వేల్పులకును మ్రొక్కనేల
కపట కల్మషములు కడుపులో నుండగా
విశ్వదాభిరామ వినురవేమా

తాత్పర్యం: పాపవర్తనము, కల్మషం ఉన్నంతవరకు పుణ్యతీర్థాలలో మునిగినా, నిధులపై తిరిగి, వేల్పులకు మ్రొక్కుచున్ననుఉ ఏమి ప్రయోజనము లేదు.

23.
పంచ ముఖములందు బంచాక్షరి జనించె
పంచ వర్ణములను ప్రబలె జగము
పంచముఖుని మీరు ప్రస్తుతి చేయుండీ
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: శివుడి అయిదు ముఖాల నుంచి పంచాక్షరి వెలువడింది. పంచాక్షరిలోని అయిదు అక్షరాల నుంచి ప్రపంచం పుట్టింది. అందుకే అందరూ ఆ పరమేశ్వరుడినే స్తుతించాలి.

24.
నేయి వెన్న కాచి నీడనే యుంచిన
బేరి గట్టిపడును పెరుగురీతి
పోరిపోరి మదిని పోనీక పట్టుము
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: వెన్నను కాచి నేతిగా మార్చి నీడలో ఉంచితో అది పేరుకుంటుంది. పెరుగులా గట్టిపడుతుంది. మనసు అదుపులో ఉన్నట్లే అనిపించినా... ఏమాత్రం ఉపేక్షించినా పట్టు జారిపోయే ప్రమాదం ఉంది.

25.
మంటికుండవంటి మాయ శరీరంబు
చచ్చునెన్నడైన, చావదాత్మ
ఘటములెన్నియైన గగనమొక్కటేగదా,
విశ్వదాభిరామ వినురవేమా

తాత్పర్యం: మట్టి కుండలాంటి దేహం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా నశిస్తుంది. కానీ ఆత్మ శాశ్వతమైంది. దానికి అది ఎన్నటికీ నాశనం కాదు. ఎన్ని దేహాలు నశించి భూమిలో కలిసిపోయినా ఆకాశం మాత్రం అలాగే ఎప్పటికీ ఉంటుంది. అందుకు శాశ్వతమైన దేహంపై అనవసరమైన ప్రేమను పెంచుకోకూడదు.

26.
మంట లోహమందు మ్రాకుల శిలలందు
పటములందు గోడప్రతిమలందు
తన్నుదెలియు కొఱకుదగులదా పరమాత్మ
విశ్వదాభిరామ వినురవేమా

తాత్పర్యం: అగ్ని, లోహం, చెట్టు పుట్ట, రాళ్ళురప్పలు, కఠినశిలలు, పటాలు, ప్రతిమలు మొదలైన అన్నింటిలోనూ పరమాత్మ నిండి ఉన్నాడు. అలాగే నీలోను దేవుడు ఉన్నాడు. ఆ సత్యాన్ని తెలుసుకొని అందరూ ప్రవర్తించాలి.

27.
నిమిషమైనను మది నిల్చి నిర్మలముగ
లింగ జీవావేశులను గాంచి భంగపడక
పూజ మదియందు జేరుట పూర్ణపదవి
పరము గోరిన నిదిచేయ బాగువేమా

తాత్పర్యం: ఎన్ని పనులున్నా కూడా క్షణకాలమైనా తీరిక చేసుకుని నిర్మలమైన మనస్సుతో లింగజీవాత్మ పరమాత్మను నిశ్చలబుద్ధితో చూచి
పూజిస్తే పూర్ణపదవి సిద్ధిస్తుంది. మోక్షం కోరుకునే మానవులకు ఇది అవసరం.

28.
ధూమాదుల నావృతమై
వ్యోమంబునకెగని కలియు నుపములు తనలో
శ్రీమించు శివుని జేరును
గామాదుల గలియడతడు ఘనముగ వేమా

తాత్పర్యం: భూమిపై ఏర్పడే పొగ మెల్లగా ఆకాశంలో కలుస్తున్నట్లుగానే, మానవునిలో ఉన్న జీవాత్మ ఈశ్వరునితో కలుసుకొనును. అప్పుడు జీవునికి కామాది వికారములుండవు.

29.
పగలుడుగ నాసలుడుగును
వగపుడుగం గోర్కెలుడుగు వడి జన్మంబుల్‌
తగులుడుగు భోగముడిగిన
త్రిగుణంబును నడుగ ముక్తి తెరువగు వేమా!

తాత్పర్యం: విరోధములు నశించిన ఆశలు నశించును. విచారము లేకున్న కోరికలు నశించును. భోగములు నశించిన జన్మములు నశించును. త్రిగుణములు నశించిననే కొని ముక్తి కలుగును.

30.
పాల నీటి కలత పరమహంస మెఱుగును
నీరు పాలు నెట్లు నేర్చునెమలి
లజ్ఞుడైన హీనుడల శివు నెఱుగునా?
విశ్వదాభిరామ వినురమేమా!

తాత్పర్యం: నీటిలో కలిసి ఉన్న పాలను వేరు వేయడం హంసకు తెలుస్తుంది. కానీ ఆ నేర్పు నెమలికి లేదు. అలాగే జ్ఞాని, ఉత్తముడు మాత్రమే పరమేశ్వరుడి పరమతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. అంతాకానీ మూర్ఖుడు ఆ తత్వాన్ని అర్థం చేసుకోలేడు.

వేమన పద్యములు (11 - 20)

11.
బ్రహ్మఘటము మేను ప్రాణంబు తగగాలి
మిత్రచంద్ర శిఖులు నేత్రచయము
మఱియు బ్రహ్మమనగ మహిమీద లేదయా
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: బ్రహ్మం అంటే ఏదో తెలియని తత్వం కాదు. మానవ దేహమే బ్రహ్మ స్వరూపం. గాలి ప్రాణం. కళ్లే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. మానవుడే బ్రహ్మమని సాధనతో తెలుసుకోవాలి.

12.
యోగిననుచు గొంత యోగముగూర్చక
జగమునెల్లబట్ట చంపి తినుచు
ధనము కొఱకు వాడు తగవాడుచుండిన
యోగికాడు వాడె యోగువేమ

తాత్పర్యం: యోగి అని ప్రకటించుకొని అందరినీ పీడించేవాడు ఎన్నటికీ యోగి కాలేడు. డబ్బు కోసం ఇతరులను బాధించేవాడు ఎందుకూ పనికిరానివాడే అవుతాడు.

13.
అర్ధ యంకణమున కాధారమైనట్టి
యొంటిమేడ గుంజు నొనరనిల్పె
నింటికొక మగండె యిల్లాండ్రునేద్గురు
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: దేహం ఒంటి స్తంభపు ఇల్లులాంటిది. దానికి జీవుడు ఒక్కడే యజమాని. కానీ ఇల్లాళ్ళు మాత్రం ఏడుగురు. వారే సప్తప్రకృతులు.

14.
అన్నదానమునకు నధిక సంపదగల్గి
యమరలోక పూజ్యుడగును మీఱు
అన్నమగును బ్రహ్మమది కనలేరయా
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది. ఆ దానాన్ని మించిన దానం లేదు. అన్నదానం చేస్తే దేవలోక పూజలు అందుకుంటాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం.

15.
బొంది యెవరి సొమ్ము పోషింపబలుమారు
ప్రాణ మెవరి సొమ్ము భక్తిసేయ,
ధనమదెవరిసొమ్ము ధర్మమె తన సొమ్ము
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: ఎంతటి బలమైన ఆహారం పెట్టి పోషించినా శరీరం శాశ్వతం కాదు. ఎవరి ప్రాణాలు శాశ్వతం కాదు. డబ్బు కూడా నిలవదు. ఎన్నిటికైనా మనం చేసిన దానధర్మాలే నిలిచి ఉంటాయి. అందుకే అందరూ ధర్మబుద్ధిని కలిగి ఉండాలి.

16.
పండువలన బుట్టె బరగ ప్రపంచము
పండువలన బుట్టె పరము నిహము
పండు మేలెఱింగె బ్రహ్లాదుడిలలోన
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: భగవంతుడు ప్రకృతి నుంచి జన్మించాడు. భగవంతుడు ఈ లోకాలను సృష్టించాడు. ఇన్ని లోకాలను సృష్టించిన భగవంతుడి గొప్పతనం ప్రహ్లాదుడి వంటి భక్తులు మాత్రమే తెలుసుకోగలిగారు.

17.
తపమువేల? యరయ ధాత్రిజనులకెల్ల
నొనర శివుని జూడ నుపమ గలదు
మనసు చదరనీక మహిలోన జూడరా
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: జనులు తపస్సు చేసి కృశించుట వ్యర్థము. భగవంతుని చూచుటకిది మార్గము కాదు. మనస్సును చెదరనీయక స్థిరముగా నుంచి ధ్యానించినచో దేవున్ని చూడవచ్చును.

18.
తనగుణము తనకు నుండగ
నెనయంగా నోరుని గుణము నెంచును మదిలో
దన గుణము తెలియ కన్యుని
బనిగొని దూషించువాడు వ్యర్థుడు వేమా!

తాత్పర్యం: మంచివో చెడ్డవో, తన గుణాలను తాను చూడకుండా ఇతరుల గుణాలను ఎంచుట, తనను తాను గమనింపక ఇతరులను దూషించుట తగదు. అలా చేయువాడు వ్యర్థుడు.

19.
జాలినొందరాదు జవదాటి కనరాదు
అది మూలమైన ఆత్మమఱుగు
పోరిచేరి పొంది పూర్ణము నందురా
విశ్వదాభిరామ వినురవేమా

తాత్పర్యం: ఆత్మరహస్యమునకుగల మూలతత్త్వమును చూడలేకపోయామని విచారపడినా, యోగనియమములను విడిచినా లాభము లేదు. ఇంద్రియాలను జయించి ఈశ్వరతత్వాన్ని పొందితేనే మేలు.

20.
జాతి, మతము విడిచి చని యోగికామేలు
జాతితో నెయున్న నీతివలదె
మతముబట్టి జాతి మానకుంట కొఱంత
విశ్వదాభిరామ వినురవేమా

తాత్పర్యం: యోగి కావాలనుకున్నవాడు జాతి, మతాలను విడిచిపెట్టాలి. ఒకవేళ జాతిని ఆశ్రయించినా కూడా నీతిని మాత్రం విడవకూడదు. ఏ జాతివాడైనను దురాచారాలను విడవకపోవడం తప్పు

వేమన పద్యములు(01 - 10)

01.
తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దు
తలచి చూడనతకు తత్వమగును
వూఱకుండ నేర్వునుత్తమ యోగిరా
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: దేవుడి అందరి హృదయాలలో ఉంటాడు. చిత్తశుద్ధితో ఆత్మ పరిశీలన చేసుకుంటే అతడు కనిపిస్తాడు. ఎలాంటి వికరాలకు లొంగకుండా ఆ తత్వాన్ని దర్శించేవాడే నిజమైన యోగి.

02.
తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కి
మిగిలి వెడలవేక మిణుకుచున్న
నరుడి కేడముక్తి వరలెడి చెప్పడీ
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: ప్రతి చిన్న విషయానికి విరక్తి చెంది ఎప్పటికీ దాని నుంచి బయటపడలేక అల్లాడేవాడు బలహీనుడు. ఆ వలలో చిక్కుకొని తప్పించుకోలేక నిర్వీర్యమైపోయేవాడికి ఎట్టి పరిస్థితుల్లోను ముక్తి లభించదు.

03.
తనదు మనసుచేత దర్కించి జ్యోతిష
మెంత చేసే ననుచు నెంచి చూచు,
తన యదృష్టమంత దైవ మెఱుంగడా?
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: తన ప్రయత్నాలు విఫలమైనప్పుడు మూర్ఖుడు జ్యోతిష్యమని, వాస్తుని వ్యర్థ వ్యాఖ్యలు చేసి ఆత్మవంచన చేసుకుంటాడు. తన విధిరాతను బట్టి అలా జరిగిందని భావించడు. తన కర్మల ఫలితమే అలా జరిగిందని, అది దేవుడే అలా చేశాడని గ్రహించడు.

04.
టీక వ్రాసినట్లేనేకులు పెద్దలు
లోకమందు జెప్పి మంచు
కాకులట్టి జనుల కానరీ మర్మము
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: ఎందరో పెద్దలు ప్రపంచ రహస్యాలకు వ్యాఖ్యలు వివరంగా చెబుతుంటారు. తెలివిలేని ప్రజలు దేవుడొక్కడే అనే వారి వివరణను గ్రహించకుండా ప్రవర్తిస్తుంటారు.


05.
జ్ఞానమెన్న గురువు జ్ఞానహైన్యము బుద్ధి
రెంటినందు రిమ్మరేచునపుడు
రిమ్మ తెలిపెనేని రెండొక రూపురా
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: జ్ఞానం గురువులాంటిది. జ్ఞానం లేకపోతే బుద్ధి అయోమయంలో కొట్టుమిట్టాడుతుంది. చంచలమైన మనస్సు జ్ఞానాజ్ఞానాల మధ్య భ్రమిస్తుంటుంది. ఈ భ్రమలకు అడ్డుకట్ట వేస్తేనే మోక్షం లభిస్తుంది.

06.
జాణలమని యంద్రు చపలాత్ములగువారు
తెలివిలేక తమ్ముతెలియలేరు
కష్టమైన యడవి గాసీలుచున్నారు
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: ప్రజలు తమను తాము తెలివిగలవారమనుకుంటారు. తమలోని అజ్ఞానాన్ని గ్రహించరు. తమను తాము తెలుసుకోలేని వారు తపస్సు చేసినా సరైన ప్రయోజనాన్ని పొందక, సారాన్ని గ్రహించలేక అడవుల్లో నివసిస్తూ పలు కష్టాలపాలవుతుంటారు.

07.
జనన మరణములన స్వప్న సుషుప్తులు
జగములందు నెండ జగములుండు
నరుడు జగమునంట నడుబాటు కాదొకో
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: చావు పుట్టుకలు స్వప్నాలలోని అవస్థలలాంటివి. ప్రపంచం ఎండమావులలోని నీటిలాంటి మిథ్య, ప్రపంచ భోగాలలో చిక్కుకొని తప్పించుకోలేక అల్లాడడం వివేకవంతులకు అవమానకరం.

08.
ఛాయననొసగుచెట్లు సాధువు బోధట్టు
లడగి దరినిజేరి పడయవచ్చు
నట్టునిట్టు దాటనది పోవునిది రామ
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యం: నీడనిచ్చే వృక్షం, మంచి బోధనలు చేసే గురువుల వల్ల అందరికీ మేలు చేకూరుతుంది. చెంత చేరగానే చెట్టు నీడను, గురువు జ్ఞానాన్ని ఇస్తారు. చెట్టు లేకపోతే నీడ ఉండదు. గురువు లేకపోతే జ్ఞానం ఉండదు.

09.
నరుడెయైన లేక నారాయణుండైన
తత్త్వబద్ధుడైన దరణి నరయ
మరణమున్నదనుచు మదిని నమ్మగవలె
విశ్వదాభిరామా వినురవేమ

తాత్పర్యం: మానవుడైన, దానవుడైనా, తత్త్వవేత్తయైనా, ఇంకెవరైనా సరే శరీరధారికి మరణమనేది తప్పనేతప్పదని గ్రహించవలెను.

10.
ద్వారంబంధమునకు దలుపులు గడియలు
వలెనె నోటికొప్పుగల నియతులు
ధర్మమెరిగి పలుక ధన్యుండౌ భువిలోన
విశ్వదాభిరామా వినురవేమ

తాత్పర్యం: ద్వారానికి తలుపులు గడియలు ఉన్నట్లే మాటకు కూడా నియమములు రక్షణలై కలవు. ధర్మమెరిగి తగినట్లు మాట్లాడినవాడే ధన్యుడు, ఉత్తముడగును.

మొదట సినిమా పాటలు అన్నావ్ మరి?

మొదట సినిమా పాటలకోసమని మొదలు పెట్టినా, మెల్ల మెల్లగా నీతి శతకం వంటివి ఇందులో చేరుతున్నాయ్. చదువరులకు అవికూడా ప్రయోజనకారిగా ఉండగలవని ఈ బ్లాగర్ ఆకాంక్ష.

సుమతి పద్యములు (91 - 98)

91.
ఇమ్ముగఁ జదువని నోరును
అమ్మాయని పిలిచి యన్నమడుగని నోరున్‌
దమ్ములఁ బిలువని నోరును
గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!

తాత్పర్యం:ఇంపుగా పఠింపని నోరు, అమ్మా అని పిలిచి అన్నం అడగని నోరు, తమ్ముడూ అని పిలవని నోరు కుమ్మరివాడు మన్ను తవ్విన గోయితో సమానం సుమా!

92.
ఆఁకొన్న కూడె యమృతము
తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్‌
సోఁకోర్చువాఁడె మనుజుఁడు
తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ!

తాత్పర్యం:లోకంలో ఆకలి వేసినప్పుడు అన్నమే అమృతము, బాధ పొందకుండా ఇచ్చువాడే దాత, ఆవేశాన్ని ఓర్చుకొనేవాడే మానవుడు, ధైర్యం కలవాడే వంశశ్రేష్ఠుడు.

93.
అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్‌
బొల్లున దంచిన బియ్యముఁ
దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!

తాత్పర్యం:అల్లుడి మంచితనం, గొల్లవాని పాండిత్యజ్ఞానం, ఆడదానియందు నిజం, పొల్లు ధాన్యములో బియ్యం, తెల్లని కాకులూ లోకములో ఉండవు.

94.
అప్పుగొని సేయు విభవము
ముప్పునఁ బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్‌
దప్పురయని నృపురాజ్యము
దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ!

తాత్పర్యం:రుణము తెచ్చుకొని అనుభవించు సౌఖ్యము, ముసలితనంలో పడుచు భార్య, తప్పులను కనిపెట్టని రాజు రాజ్యము సహింపరానివి. చివరకు హాని కలిగించేవి.

95.
అడియాస కొలువుఁ గొలువకు
గుడిమణియము సేయఁబోకు కుజనులతోడన్‌
విడువక కూరిమి సేయకు
మడవినిఁదో డరయఁకొంటి నరుగకు సుమతీ!

తాత్పర్యం:వృథా ప్రయాస అగు సేవను చేయకుము. గుడి ధర్మకర్తృత్వమును చేయకుము. చెడ్డవారితో స్నేహము చేయకుము. అడవిలో సహాయం లేకుండా ఒంటరిగా పోకుము.

96.
అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్‌
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుకు బ్రతుకవచ్చు మహిలో సుమతీ!

తాత్పర్యం:అడిగినప్పుడు జీతమును ఈయని గర్వి అయిన ప్రభువును సేవించి జీవించుట కంటే, వేగముగా పోగల ఎద్దులను నాగలికి కట్టుకుని పొలమును దున్నుకొని వ్యవసాయం చేసుకోవడం మంచిది.

97.
అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా
నెక్కినఁ బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!

తాత్పర్యం:అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధ సమయమున ఎక్కినప్పుడు ముందుకు పరిగెత్తని గుర్రమును వెంటనే విడిచిపెట్టవలయును.

98.
శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా
ధారాళమైన నీతులు
నోరూరఁగఁ జవులుపుట్ట నుడివెద సుమతీ!

తాత్పర్యం: మంచిబుద్ధి గలవాడా! శ్రీరాముని దయవల్ల నిశ్చయముగా అందరు జనులనూ శెభాషని అనునట్లుగా నోటి నుంచి నీళ్లూరునట్లు రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను.

సుమతి పద్యములు (81 - 90)

81.
ఓడల బండ్లును వచ్చును
ఓడలు నాబండ్ల మీద నొప్పుగ వచ్చును
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ!

తాత్పర్యం:నావలపై బళ్లు, బళ్లపై నావలు వచ్చునట్లే, భాగ్యవంతులకు దారిద్య్రం, దరిద్రులకు భాగ్యం పర్యాయంగా వస్తూంటాయి.

82.
ఒల్లనిసతి నొల్లనిపతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే
గొల్లండు గాక ధరలో
గొల్లండును గొల్లడౌను గుణమున సుమతీ!

తాత్పర్యం: తన్ను ప్రేమించని భర్యను, యజమానిని, స్నేహితుడ్ని విడిచి పెట్టడానికి అంగీకరించనివాడే వెర్రి గొల్లవాడు గానీ జాతిచేత గొల్లవాడైనంత మాత్రాన గుణాల్లో వెర్రి గొల్లవాడు కాదు.

83.
ఒకయూరికి నొక కరణము
నొక తీర్పరియైనఁ గాక వొగిఁదరుచైనం
గకవికలు గాక యుండునె
సకలంబును గొట్టువడక సహజము సుమతీ!

తాత్పర్యం: ఒక గ్రామానికి ఒక లేఖరి, ఒక ధర్మాధికారి ఉండాలి. అలాకాక ఎక్కువమంది అయితే అనేక గందరగోళాలు పుట్టి సమస్తం చెడిపోవుట సహజము.

84.
ఏరకుమీ కసుగాయలు
దోరకుమీ బంధుజనుల దోషముసుమ్మీ
పారకుమీ రణమందున
మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!

తాత్పర్యం: భూమిపై... పచ్చికాయలు ఏరి తినకు. చుట్టాలను దూషించకు. యుద్ధం నుంచి వెనుతిరిగి పారిపోకు. పెద్దల ఆజ్ఞలను జవదాటకు సుమా!

85.
ఎప్పుడు సంపద కలిగిన
అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్‌
దెప్పలుగ జెరువునిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!

తాత్పర్యం: చెరువు నిండా నీరు చేరగానే వేలకొద్దీ కప్పలు అందులో చేరునట్లే సంపద కలిగిన వారి వద్దకే బంధువులు ఎక్కువగా జేరుకొందురు.

86.
ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని కొల్వ గూడ దదియెట్లన్నన్‌
సర్పంబు పడగనీడను
గప్పవసించిన విధంబు గదరా సుమతీ!

తాత్పర్యం: నల్లతాచు నీడలో నివశించే కప్ప బతుకు ఎంత అస్థిరమో ఆవిధంగానే ఎప్పుడూ తప్పులు వెతికే యజమానిని సేవిచే వాడి బతుకూ ప్రాణభయంతో కూడినదే సుమా!

87.
ఉపకారికి నుపకారము
విపరీతముగాదు సేయ వివరింపంగా
నుపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!

తాత్పర్యం:మేలు చేసిన వానికి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి అంతకుముందు వాడు చేసిన దోషాలను లెక్కచేయక ఉపకారం చేసేవాడే నేర్పరి.

88.
ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్‌
మొదవుకడ నున్న వృషభము
జదువని యా నీచుకడకుఁ జనకుర సుమతీ!

తాత్పర్యం: నీరు తాగే గుర్రం దగ్గరకు, కొవ్వుతో విజృంభించే మదపుటేనుగు దగ్గరకు, ఆవు దగ్గర ఉన్న ఆబోతు వద్దకు, విద్యనేర్వని అల్పుని దగ్గరకు వెళ్లకుము.

89.
ఉత్తమ గుణములు నీచు
కెత్తెర గునగలుగనేర్చు నెయ్యడలం దా
నెత్తిచ్చి కరగిపోసిన
నిత్తడి బంగారుమగునె ఇలలో సుమతీ!

తాత్పర్యం:బంగారానికి సమానమైన ఎత్తు ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరిగించిపోసినా బంగారం ఎట్లు కానేరదో అదేవిధంగా లోకంలో నీచునకు ఎక్కడా ఏ విధంగానూ మంచి గుణాలు కలగవు.

90.
ఉడుముండదె నూరేండ్లును
బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్‌
మడుపునఁ గొక్కెర యుండదె
కడు నిల బురుషార్థపరుడు గావలె సుమతీ!

తాత్పర్యం:ఉడుము నూరేళ్లు, పాము పది వందల ఏళ్లు, కొంగ చెరువులో చిరకాలం జీవిస్తున్నాయి. వాటి జీవితాలన్నీ నిరుపయోగాలే. మానవుని జీవితం అలా కాక ధర్మార్థకామమోక్షాసక్తితో కూడినది కావాలి.

సుమతి పద్యములు (71 - 80)

71.
కాముకుడు దనిసి విడిచిన
కోమలి బరవిటుడు గవయ గూడుట యెల్లన్‌
బ్రేమమున జెరకు పిప్పికి
జీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ!

తాత్పర్యం: విటుడు తృప్తిపడేట్లు భోగించి విడిచన కాంతను మరొకడు జారుడు అనుభవించాలని కోరడం చెరకులోని రసాన్ని సంపూర్ణంగా తీసివేసిన తరవాత పిప్పికై చీమలు ముసుకొన్నట్లు ఉండును.

72.
కాదు సుమీ దుస్సంగతి
పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్‌
వాదుసుమీ యప్పిచ్చుట
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ!

తాత్పర్యం:చెడ్డవారితో స్నేహం మంచిది కాదు. కిర్తి వచ్చిన తరవాత అది నశించదు. అప్పు తీసుకోవడం తగవులకు మూలం. స్త్రీల వద్ద ప్రేమ శూన్యం.

73.
కవిగానివాని వ్రాఁతయు
నవరసభావములు లేని నాతుల వలపుం
దవిలి చను పందినేయని
వివిధాయుధ కౌశలంబు వృథరా సుమతీ!

తాత్పర్యం: కవి కానివాడు రాసిన రచన, తొమ్మిది రసాల స్థితులు తెలియని స్త్రీ ప్రేమ, ముందుపోయే పందిని వెంబడించి కొట్టలేని వాని ఆయుధ విద్యలోని నేర్పరితనం వ్యర్థం.

74.
కసుగాయఁ గరచి చూచిన
మసలక తన యోగరుగాక మధురంబగునా?
పసగలుగు యువతులుండఁగఁ
బసిబాలలఁ బొందువాఁడు పశువుర సుమతీ!

తాత్పర్యం: పక్వానికి వచ్చిన పళ్లను వదిలి పచ్చికాయలను తింటే వగరుగా ఉన్నట్లే, చాతుర్యం గల పడుచులు ఉండగా పసిపాపలను కూడెడు వానికి సుఖము శూన్యము. అలాంటివాడు నిజంగా పశువే.

75.
కరణము సాధై యున్నను
గరి మద ముడిగినను బాము కరవకయున్నన్‌
ధరదేలు మీటకున్నను
గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ!

తాత్పర్యం: కరణం నెమ్మదస్తుడైనా, ఏనుగు మదం పోయినది అయినా, తాచుపాము కరవకున్నా, తేలు కుట్టకున్నా ఆశ్చర్యంతో మిక్కిలి తేలికగా చూస్తారు.

76.
కరణము గరణము నమ్మిన
మరణాంతకమౌను గాని మనలేడు సుమీ
కరణము తన సరి కరణము
మరి నమ్మక మర్మమీక మనవలె సుమతీ!

తాత్పర్యం: ఒక లేఖకుడు మరో లేఖకుని నమ్మితే మరణంతో సమానమైన ఆపదను కొనితెచ్చుకున్నట్లే. అందుకే, లేఖకుడు తనతో సమానమైన మరో లేఖరిని విశ్వసింపక, తన గుట్టును చెప్పక జీవించాలి.

77.
కమలములు నీడఁ బాసినఁ
గమలాప్తుని రశ్మి సోకి కమలినభంగిన్‌
దమ దమ నెలవులు దప్పినఁ
దమ మిత్రులు శతృలౌట తథ్యము సుమతీ!

తాత్పర్యం: కమలములు పుట్టిల్లయిన నీటిని విడిచిపెట్టి మిత్రుడు అయిన సూర్యుని ఎండ తాకిన వెంటనే కమిలిపోతున్నాయి. అలాగే, మానవులు తమ నివాసాలను విడిచిపెడితే స్నేహితులే శతృలవుతారు.

78.
కప్పకు నొరగాలైనను
సప్పమునకు రోగమైన సతి తులువైనన్‌
ముప్పున దరిద్రుడైనను
దప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతీ!

తాత్పర్యం:కప్పకు కాలు విరిగినా, పాముకు రోగం వచ్చినా, భార్య దుష్టురాలైనా, ముసలితనంలో దారిద్య్రం సంభవించినా ఎక్కువ దుఃఖప్రదాలు అవుతాయి.

79.
కనకపు సింహాసనము
శునకముఁ గూర్చుండబెట్టి శుభలగ్నమునఁ
దొనరఁగ బట్టముగట్టిన
వెనకటి గుణమేల మాను వినరా సుమతీ!

తాత్పర్యం: శుభ ముహూర్తంలో కుక్కను తీసుకొచ్చి బంగారు సంహాసనంపై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా, దాని నిజనైజాన్ని ఎలా మానలేదో అల్పునికి ఎంత గౌరవం చేసి మంచి పదవి ఇచ్చినా తన నీచత్వాన్ని వదలలేడు.

80.
కడు బలవంతుడైనను
బుడమిని బ్రాయంపుటాలి బుట్టినయింటం
దడవుండనిచ్చె నేనియు
బడుపుగ నంగడికి దానె పంపుట సుమతీ!

తాత్పర్యం: ఎంత సమర్థత కలవాడైనా యవ్వనంలో భార్యను చిరకాలం పుట్టింట ఉండనిచ్చినచో తానే స్వయంగా భార్యను వ్యభిచార వృత్తికి దింపినవాడగును.

సుమతి పద్యములు (61 - 70)

61.
చేతులకు దొడవు దానము
భూతలనాధులకుఁ దొడవు బొంకమి ధరలో
నీతియ తొడ వెవ్వారికి
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!

తాత్పర్యం: చేతులకు దానం, పాలకులకు అసత్యం పలకకుండడం, అందరికీ న్యాయం, స్త్రీకి అభిమానం అలంకారాలు.

62.
చుట్టములు గానివారలు
చుట్టములము నీకటంచు సొంపుదలర్పన్‌
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగఁ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ!

తాత్పర్యం: ధనం ఎక్కువగా ఉన్నట్లయితే బంధువులు కాని వారు కూడా మేము మీకు బంధువులమే అంటూ పట్టుదలతో గట్టిగా మనల్ని ఆశ్రయించడానికి వస్తారు.

63.
కొెరగాని కొడుకు పుట్టినఁ
కొెరగామియె కాదు తండ్రి గుణముల బెెరచుం
జెెరకు తుద వెన్నుఁపుట్టిన
జెెరకునఁ దీపెల్ల జెెరచు సిద్ధము సుమతీ!

తాత్పర్యం: చెరకుగెడ చివర వెన్ను పుడితే అది చెరకులోని తీయదనాన్ని ఏ విధంగా పాడు చేస్తుందో అలాగే అప్రయోజకుడైన కుమారుడు పుట్టడం వల్ల ఆ కుటుంబానికి ఉపయోగ పడకపోగా తండ్రికి ఉన్న మంచి పేరును కూడా చెడగొడతాడు.

64.
కోమలి విశ్వాసంబును
బాములతోఁ జెలిమి యన్యభామల వలపున్‌
వేముల తియ్యఁదనంబును
భూమీశుల నమ్మికలుసు బొంకుర సుమతీ!

తాత్పర్యం: స్త్రీల పట్ల విశ్వాసం, పాములతో స్నేహం, పరస్త్రీల ప్రేమ, వేప చెట్లలో తీయదనం, రాజుల పట్ల నమ్మకం అన్నీ అసత్యాలు.

65.
గడనగల మననిఁజూచిన
నడుగగడుగున మడుఁగులిడుచు రతివలు తమలో
గడ నుడుగు మగనిఁ జూచిన
నడుపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ!

తాత్పర్యం:స్త్రీలు సంపాదన ఉన్న భర్తను చూస్తే అడుగులకు మడుగులు ఒత్తుతారు, పూజిస్తారు. సంపాదన లేని మగడిని చూస్తే నడిచే శవం వచ్చిందని హీనంగా మాట్లాడతారు.

66.
చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైన యట్లు పామరుఁడు దగన్‌
హేమంబుఁ గూడఁబెట్టిన
భూమీశులపాఁ జేరు భువిలో సుమతీ!

తాత్పర్యం: చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమైనట్లు అజ్ఞాని కూడబెట్టిన బంగారమంతా రాజుల వశమై పోతుంది.

67.
కులకాంత తోడ నెప్పుడుఁ
గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ!

తాత్పర్యం: భార్యతో ఎప్పుడూ తగాదా పడవద్దు. ఆమెపై లేనిపోని నేరాలను ఆరోపించవద్దు. ఉత్తమ ఇల్లాలు కంట నీరు కింద పడిన ఇంటిలో లక్ష్మిదేవి ఉండదు.

68.
కూరిమిగల దినములలో
నేరము లెన్నఁడును గలుఁగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ!

తాత్పర్యం:పరస్పరం స్నేహం ఉన్న రోజుల్లో నేరాలు ఎప్పుడూ కనిపించవు. ఆ స్నేహం చెడగానే అన్ని తప్పులుగానే కనిపిస్తాయి. ఇది నిజం.

69.
కొంచెపు నరుసంగతిచే
నంచితముగఁ గీడువచ్చు నదియెట్లన్నన్‌
గించిత్తు నల్లి కుట్టిన
మంచమునకుఁ జేటువచ్చు మహిలో సుమతీ!

తాత్పర్యం: చిన్న నల్లి కుడితే... ఆ నల్లి ఉన్న మంచాన్ని ఎండలో వేయడం, కర్రతో కొట్టడం, మరుగునీళ్లు పోయడం మొదలైన వన్నీ చేస్తాం. నల్లితో స్నేహం చేయడం వల్లే మంచానికే ఈ కష్టాలు. అలాగే అల్పుడైన వాడితో స్నేహం చేస్తే ఎలాంటి వారికైనా ఆపదలు వస్తాయి.

70.
కారణములేని నగవును
బేరణమును లేని లేమ పృథివీస్థలిలో
బూరణము లేని బూరెయు
వీరణములేని పెండ్లి వృధరా సుమతీ!

తాత్పర్యం: కారణం లేని నవ్వు, నృత్యం (రవిక) లేని స్త్రీ, పూర్ణం లేని బూరె, వీరణం లేని పెళ్లి వ్యర్థాలు.

సుమతి పద్యములు (51 - 60)

51.
దగ్గర కొండెము సెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మరితా
నెగ్గుఁబ్రజ కాచరించుట
బొగ్గులకై కల్పతరువు బొడచుట సుమతీ!

తాత్పర్యం:మంత్రి చెప్పే చాడీ మాటలకు లోబడి మంచిచెడ్డలు తెలుసుకొనక రాజు ప్రజలను హింసించడం బొగ్గుల కోసం కోరిన కోరికలిచ్చే కల్పవృక్షాన్ని నరికేసుకోవడం వంటిది.

52.
తాను భుజింపని యర్థము
మానవపతిఁ జేరుఁగొంత మరి భూగతమౌఁ
గానల నీఁగల గూర్చిన
దేనియ యెరుఁజేరునట్లు తిరగమున సుమతీ!

తాత్పర్యం: అరణ్యంలో తేనెటీగలు కూడబెట్టిన తేనె కడకి తరుల పాలైనట్లు లోభి నోరు కట్టుకొని కూడబెట్టిన ధనం కొంత ప్రభువుల పాలును, మరికొంత భూమి పాలగును.

53.
తలమాసిన నొలుమాసిన
వలువలు మాసినను బ్రాన వల్లభునైనం
గులకాంతలైన రోఁతురు
తిలకింపఁగ భూమిలోన దిరముగ సుమతీ!

తాత్పర్యం:భూలోకంలో... తలమాసినా, శరీరానికి మురికి పట్టినా, మట్టలు మాసిపోయినా చేసుకొన్న భర్తనయినా ఇల్లాళ్లు ఏవగించుకుంటారు.

54.
తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్‌
దలతోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

తాత్పర్యం: పాముకి విషయం తలలోను, తేలుకు తోకలోనూ, దుష్టునకు నిలువెల్లా విషం ఉంటుంది.

55.
తములము వేయని నోరును
విమతులతో జెలిమిసేసి వెతఁబడు తెలివిన్‌
గమలములు లేని కొలకుఁను
హిమధాముఁడు లేని రాత్రి హీనము సుమతీ!

తాత్పర్యం:తాంబూలం వేయని నోరు, దుర్మార్గులతో స్నేహం చేసి బాధపడే బుద్ధి, తామరపూలు లేని చెరువు, చంద్రుడు లేని రాత్రి శోభిల్లవు.

56.
తనవారు లేనిచోటను
జనవించుక లేనిచోట జగడముచోటన్‌
అనుమానమైన చోటను
మనుజునకును నిలువఁదగదు మహిలో సుమతీ!

తాత్పర్యం: కావాల్సిన చుట్టాలు లేనిచోట, మాట చెల్లుబడికాని ప్రదేశంలో, తగవులాడుకొనేచోట, తనను అవమానించే ప్రదేశాల్లో మానవుడు నిలువరాదు.

57.
తన కలిమి ఇంద్రభోగము
తన లేమియె సర్వలోక దారిద్య్రంబున్‌
తన చావు జతద్ప్రళయము
తను వలచినదియె రంభ తథ్యము సుమతీ!

తాత్పర్యం: తన ఐశ్వర్యమే దేవలోక వైభవం; తన దారిద్య్రమే సమస్తలోక దారిద్య్రం; తన చావే ప్రపంచానికి ప్రళయం; తాను ప్రేమించినదే రంభ; మనుషులు భావించేది ఈ విధంగానే... ఇది నిజము.

58.
తనయూరి తపసితనమును
దనపుత్త్రుని విద్య పెంపుఁ దన సతి రూపున్‌
దన పెరటిచెట్టు మందును
మనసున వర్ణింప రెట్టి మనుజులు సుమతీ!

తాత్పర్యం: తన ఊరివాళ్ల తపోనిష్ఠ, కుమారుని విద్యాధిక్యత, భార్య సౌందర్యం, ఇంటి వైద్యాలను ఎవ్వరూ కూడా గొప్పగా వర్ణించి చెప్పరు.

59.
తన కోపమె తన శతృవు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌఁ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ!

తాత్పర్యం: తన కోపమే తనకు శతృవువలే బాధించును. తన శాంతమే తనను రక్షించును. దయయే చుట్టాలవలే సాయపడును. ఆనందమే ఇంద్రలోక సౌఖ్యము. దుఃఖమే నరకం అగును. ఇది నిజం.

60.
తడ వోర్వక యొడలోర్వక
కడువేగం బడచిపడినఁ గార్యంబగునే
తడవోర్చిన నొడలోర్చినఁ
జెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతీ!

తాత్పర్యం: ఆలస్యాన్ని, శరీర శ్రమను సహించకుండా తొందరపడినా కార్యం కాదు. ఆలస్యాన్ని, శరీర శ్రమను ఓర్చుకొన్నప్పుడే చెడిపోయిన కార్యం కూడా నెరువేరుతుండును.

సుమతి పద్యములు (41 - 50)

41.
పగవల దెవ్వరితోడను
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్‌
దెగనాడవలదు సభలను
మగువకు మనసీయవలదు మహిలో సుమతీ!

తాత్పర్యం: భూమిపై ఎవరితోనూ విరోధం మంచిది కాదు. దార్రిద్య్రం వచ్చిన తరవాత విచారింపరాదు. సభలో ఎవరినీ దూషింపరాదు. స్త్రీకి తన హృదయాన్ని తెలియనీరాదు.

42.
నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లిదండ్రి నాధులతోడన్‌
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!

తాత్పర్యం: సభల్లో, తల్లిని, తండ్రిని, భర్తను, ఇతరుల భార్యను, బ్రాహ్మణులను చూసి నవ్వరాదు.

43.
నవరస భావాలకృత
కవితాగోష్ఠియును మధుర గానంబును
నవివేకి కెంతఁజెప్పినఁ
జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ!

తాత్పర్యం: తొమ్మిది రసాలతోకూడిన మంచి భావాలతో శృంగారింపబడిన కవిత్వ సంబంధ సంభాషణ, కమ్మని సంగీతాన్ని జ్ఞానహీనునకు వినిపించడం, చెవిటి వాని ముందు శంఖం వూదినట్లే.

44.
నరపతుల మేరంఁదప్పిన
దిర మొప్పగ విధవ ఇంట దీర్పరియైనన్‌
గరణము వైదికుఁడయినను
మరణాంతకమౌనుగాని మానదు సుమతీ!

తాత్పర్యం: రాజు హద్దుమీరి ప్రవర్తించినా, శాశ్వతంగా విధవ ఇంట పెత్తందారైనా, లేఖకుడు నియోగి కాక వైదికుడయినా ప్రాణము మీదికి వచ్చును. తథ్యము.

45.
నవమున బాలుంద్రావరు
భయమునను విషమ్మునైన భక్షింతురుగా
నయమెంత దోసకారియె
భయమే చూపంగవలయు బాగుగ సుమతీ!

తాత్పర్యం: మెత్తని మాటలతో పాలు కూడా తాగరు. భయపెడితే విషాన్నైనా తాగుతారు. మృదుత్వమెప్పుడూ చెడునే కలిగిస్తుంది. కనక చక్కగా భయాన్నే చూపవలయును.

46.
నమ్మకు సుంకరి జూదరి
నమ్మకు మగసాలివాని నటు వెలయాలిన్‌
నమ్మకు మంగలివానిని
నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ!

తాత్పర్యం: పన్నులు వసూలు చేసే వానిని, జూదం ఆడేవాడిని, కమసాలివానిని, నటకుని, వేశ్యను, వర్తకుని, ఎడమ చేతితో పనులు చేసేవాడిని నమ్మవద్దు.

47.
నడువకుమీ తెరువొక్కటఁ
గుడువకుమీ శతృనింటఁ గూరిమితోడన్‌
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యెరులమనసు నొవ్వగ సుమతీ!

తాత్పర్యం:తోడులేకుండా వంటరిగా పోవద్దు. విరోధి ఇంట్లో భుజింపవద్దు. ఇతరుల ధనం దగ్గర ఉంచుకోవద్దు. ఇతరుల మనస్సు బాధపడేట్లు మాట్లాడవద్దు.

48.
ధీరులకుఁ జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్‌
గారవమును మరిమీదట
భూరిసుఖావహము నగును భువిలో సుమతీ!

తాత్పర్యం:బుద్ధిమంతుడికి చేసే మేలు కొబ్బరికాయలోని నీరు వలే శ్రేష్టమైనది, ప్రియమైనది, గొప్ప సుఖానికి స్థానాన్ని ఇచ్చేదీ అగును.

49.
ధనపతి సఖుఁడై యుండియు
నెనయంగా శివుఁడు భిక్షమెత్తగవలసెన్‌
దనవారి కెంతకల గిన
దనభాగ్యమె తనఁకుగాక తథ్యము సుమతీ!

తాత్పర్యం:గొప్ప ధనవంతుడైన కుబేరుడు మిత్రడుగా ఉన్నా శివునికి బిచ్చం ఎత్తవలసి వచ్చింది. కనుక తాను సంపాదించుకున్న (తన దగ్గరున్న) భాగ్యమే తనకు సహాయపడాలి గానీ తన దగ్గర ఉన్నవారి దగ్గర ఎంత భాగ్యం ఉన్నా నిష్ప్రయోజనం

50.
చేతులకు దొడవు దానము
భూతలనాధులకుఁ దొడవు బొంకమి ధరలో
నీతియ తొడ వెవ్వారికి
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!

తాత్పర్యం: చేతులకు దానం, పాలకులకు అసత్యం పలకకుండడం, అందరికీ న్యాయం, స్త్రీకి అభిమానం అలంకారాలు.

సుమతి పద్యములు (31 - 40)

31.
పాటెరుగని పతికొలువును
గూటంబున కెరుకపడని కోమలిరతియు
జేటెత్తజేయు చెలిమియు
నేటికి నెదిరీదినట్టు లెన్నగ సుమతీ

తాత్పర్యం: శ్రమను తెలుసుకోలేని ప్రభువును సేవించడం, కలయికకు తెలివిలేని స్త్రీతో సంభోగం, వెంటనే చెడిపోయేట్లున్న స్నేహం నదీ ప్రవాహానికి ఎదురీదినట్లే.

32.
పలుదోమి సేయు విడియము
తలగడిగిన నాఁటినిద్ర తరుణులయెడలం
బొలయలుక నాటి కూటమి
వెల యింతని చెప్పరాదు వినురా సుమతీ!

తాత్పర్యం: దంతధావనం చేసుకుని, తలంటు పోసుకుని, తాంబూలం వేసుకుని పోయిన నిద్ర, స్త్రీలతో ప్రణయకలహం వచ్చిన రోజు పొందు అత్యంత సౌఖ్యప్రదాలు. వాటి విలువ ఇంతని చెప్పలేము.

33.
పర్వముల సతులఁ గవయకు
ముర్వీశ్వరుకరుణ నమ్మి యబ్బకు మదిలో
గర్వింపనాలి బెంపకు
నిర్వహణము లేనిచోట నిలువకు సుమతీ

తాత్పర్యం: పుణ్యదినాల్లో స్త్రీలతో కలవకుము. ప్రభువుల దయను నమ్మి మనసులో ఉప్పొంగకుము. గర్వంతో విర్రవీగే భార్యను పోషింపకు. సాగుదల లేనిచోట నిలవకు.

34.
పరుల కనిష్టము సెప్పకు
పొరుగిండ్లకు బనులులేక పోవకు మెపుడున్‌
బరుఁగదిసిన సతి గవయకు
ఎరింగియు బిరుసై సహయము నెక్కకు సుమతీ!

తాత్పర్యం: ఇతరులకు అప్రియములను పలకవద్దు. పనులు లేక పొరుగిళ్లకు పోవద్దు. ఎప్పుడూ ఇతరులు పొందిన భార్యను కలివవద్దు. తెలిసీ, పొగరుబోతైన గుర్రాన్ని ఎక్కవద్దు.

35.
రూపువంక పేరు రూఢిగా నిలుచును
పేరువంక క్రియలు పెనగుచుండు
నాశమౌను తుదకు నామరూప క్రియల్‌
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం: మానసిక ధ్యానంవలన దివ్యత్వమును పొందవచ్చును. కానీ, ఏదో ఒక రూపం నిర్మించి పేరుపెట్టి, ఆర్భాటంగా పూజలు చేస్తే లాభంలేదు.

36.
పరసతుల గోష్టినుండి
పురుషుడు గాంగేయుడైన భువి నిందబడున్‌
బరుసతి సుశీయైనను
బరుసంగతినున్న నింద పాలగు సుమతీ!

తాత్పర్యం: భూమిపై, పర స్త్రీలతో సరససల్లాపాలు ఆడితే భీష్ముడయినా నిందను ఎదుర్కొనవలసిందే. ఇతర స్త్రీ ఎంత మంచిదయినా పర పురుషునితో స్నేహం చేస్తే అపకీర్తి పాలగును.

37.
పరసతి కూటమి గోరకు
పరధనముల కాసపడకు పరునెంచకుమీ
సరిగాని గోష్టి సేయకు
సిరిచెడి జుట్టంబుకడకుఁ జేరకు సుమతీ!

తాత్పర్యం: ఇతర స్త్రీలతో కలయికను కోరవద్దు. ఇతరుల భాగ్యానికి ఆశపడకు. ఇతరుల దోషాలను లెక్కించవద్దు. మంచిది కాని సంభాషణ చేయవద్దు. భాగ్యం పోయినప్పుడు బంధువుల వద్దకు చేరకుము.

38.
పరనారీ సోదరుఁడై
పరధనముల కాసపడక పరులకు హితుడైఁ
పరుల దనుఁబొగడ నెగడక
పరుఁలలిగిన నలుగనతఁడు పరముడు సుమతీ!

తాత్పర్యం: ఇతర స్త్రీలను తోబుట్టువులుగా చూసుకొంటూ, ఇతరుల ధనానికి ఆశపడకుండా, అందరికీ ఇష్టుడై, ఇతరులు పొగుడుతుంటే ఉప్పొంగక, కోపం ప్రదర్శించినప్పుడు బాధ పడకుండా ఉండేవాడే శ్రేష్టుడు.

39.
పనిచేయునెడల దాసియు
ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్‌
దనభుక్తి యెడలఁ దల్లియు
ననఁ దన కులకాంత యుండనగురా సుమతీ!

తాత్పర్యం: భార్య... ఇంటిపనుల్లో దాసిగా, సంభోగ సమయంలో రంభగా, సలహాలిచ్చేటప్పుడు మంత్రిగా, భోజనం పెట్టే సమయంలో తల్లిగా ప్రవర్తించేలా ఉండాలి.

40.
పతికడకుఁ దన్నుగూర్చిన
సతికడకును వేల్పుకడకు సద్గురు కడకున్‌
సుతుకడకు రిత్తచేతుల
మతిమంతులు చనరు నీతిమార్గము సుమతీ!

తాత్పర్యం: ప్రభువు వద్దకు, భార్య దగ్గరికి, భగవంతుని సన్నిధానానికి, గురువు వద్దకు, కుమారుని దగ్గరకు బుద్ధిమంతులు వట్టిచేతులతో వెళ్లరు. ఇదియే నీతిమార్గము.

సుమతి పద్యములు (21 - 30)

21.
బలవంతుడ నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!

తాత్పర్యం: నేను చాలా బలవంతుడ్ని. నాకేమీ భయం లేదని నిర్లక్ష్యం చేసి విర్రవీగి విరోధం తెచ్చుకోవడం మంచిది కాదు. అది ఎప్పుడూ హాని కలిగిస్తుంది. ఎంతో బలం కలిగిన సర్పం కూడా చలిచీమలకు లోబడి చావడం లేదా?

22.
బంగారు కుదువబెట్టకు
సంగరమునఁ బారిపోకు సరసుఁడవగుచో
నంగడి వెచ్చములాడకు
వెంగలితో జెలిమి వలదు వినురా సుమతీ!

తాత్పర్యం: బంగారు నగలను తాకట్టు పెట్టవద్దు. యుద్ధభూమి నుంచి వెన్నిచ్చి పారిపోవద్దు. దుకాణం నుంచి సరకులు అరువు తెచ్చుకోవద్దు. మూఢునితో స్నేహం చేయవద్దు.

23.
పొరుగున పగవాడుండిన
నిర వొందగ వ్రాతగాఁడె ఏలికయైనన్‌
ధరఁగాఁపు కొండెమాడినఁ
గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ!

తాత్పర్యం: ఇంటి పక్కనే శతృవు ఉన్నా, బాగా రాయగలవాడే ప్రభువు అయినా, గ్రామ పెత్తందారు కొండెములు చెప్పేవాడయినా లేఖరుకు జీవితం గడవదు.

24.
పెట్టిన దినములలోపల
నట్టడవులకైనవచ్చు నానార్థములున్‌
బెట్టని దినములఁ గనకపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ!

తాత్పర్యం: అదృష్టం కలసివచ్చిన రోజుల్లో అడవి మధ్యలో ఉన్నా అన్ని సంపదలూ అక్కడికే వస్తాయి. దురదృష్టం వెన్నాడేటపుడు బంగారు పర్వతాన్ని ఎక్కినా ఏమీ లభించదు.

25.
పులిపాలు దెచ్చిఇచ్చిన
నలవడఁగ గుండెగోసి యరచే నిడినం
దలపొడుగు ధనము బోసిన
వెలయాలికి గూర్మిలేదు వినురా సుమతీ!

తాత్పర్యం: దుస్సాధ్యమైన పులిపాలు తెచ్చి ఇచ్చినా, హృదయాన్ని కోసి అరచేతిలో పెట్టినా, నిలువెత్తు ధనం పోసినా వేశ్యకు నిజమైన ప్రేమ ఉండదు.

26.
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

తాత్పర్యం: కుమారుడు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు. ప్రజలు ఆ కుమారుడ్ని మెచ్చిన రోజుననే నిజమైన సంతోషం కలుగుతుంది.

27.
పురికిని బ్రాణము కోమటి
వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనం
గరికిని బ్రాణము తొండము
సిరికిని బ్రాణము మగువ సిద్ధము సుమతీ!

తాత్పర్యం: ఈ లోకంలో పట్టణానికి వైశ్యుడు, వరిసస్యమునకు నీళ్లు, ఏనుగుకు తొండము, ఐశ్వర్యానికి స్త్రీ జీవం ఒసంగుదురు.

28.
పిలువని పనులకు బోవుట
కలయని సతి రతియు రాజు గానని కొలువు
బిలువని పేరంటంబును
వలవని చెలిమియును జేయవలదుర సుమతీ

తాత్పర్యం: పిలవని కార్యక్రమాలకు వెళ్లడం, హృదయంతో కలవని స్త్రీతో సంభోగం, పాలకులు చూడని సేవ, పిలవని పేరంటం, కోరని స్నేహం చేయదగదు.

29.
పాలసునకైన యాపద
జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకుఁ
దే లగ్నిబడగఁ బట్టిన
మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ!

తాత్పర్యం: తేలు నిప్పులో పడినప్పుడు దానిని జాలితో బయటకు తీసి పట్టుకొంటే కుడుతుంది. కానీ మనం చేసే మేలును తెలుసుకోలేదు. అలాగే జాలిపడి మూర్ఖునికి ఆపదలో సహాయం చేయజూస్తే తిరిగి మనకే ఆపకారం చేస్తాడు. కనుక అట్లు చేయరాదు.

30.
పాలను గలిసిన జలమును
బాలవిధంబుననే యుండుఁ బరికింపగ
బాల చవిఁజెరచు గావున
బాలసుఁడగువాని పొందు వలదుర సుమతీ!

తాత్పర్యం: పాలతో కలిసిన నీరు కూడా పైకి పాలలాగే కనపడుతుంది. పరిశీలిస్తే పాల రుచిని చెడగొడుతుంది. అలాగే, చెడ్డవారితో స్నేహం స్వగౌరవాన్ని కూడా పోగొట్టును. కనుక అలాంటి స్నేహం వలదు.

సుమతి పద్యములు (11 - 20)

11.
వరి పంటలేని యూరును
దొరయుండని యారు తోడు దొరకని తెరువున్‌
ధరను బతిలేని గృహమును
అరయంగా రుద్రభూమి యనదగు సుమతీ!

తాత్పర్యం: ధాన్యం పంటలేని గ్రామం, రాజు నివశింపని నగరం, సహాయం దొరకని మార్గం, భర్త (రాజు)లేని గృహం ఆలోచించగా స్మశానంతో సమానమని చెప్పవచ్చు.

12.
వరదైన చేను దున్నకు
కరవైనను బంధుజనుల కడకేగకుమీ
పరులకు మర్మము సెప్పకు
పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ!

తాత్పర్యం: వరద ముంచిన చేనును దున్నవద్దు. కూడు కరవైనను బంధువుల ఇంటికి పోవద్దు. ఇతరులకు రహస్యాల్ని చెప్పవద్దు. పిరికివాడికి సేనానాయక పదవిని ఇయ్యవద్దు.

13.
లావుగలవానికంటెను
భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!

తాత్పర్యం: పెద్ద పర్వతమంటి ఏనుగుకంటే చిన్నవాడైన మావటి లోబరుచుకుని ఎక్కుచున్నాడు కనక మావటి గొప్పవాడు. అలాగే శరీరబలం కలవాని కంటే బుద్ధిబలం కలవాడే నిజమైన బలవంతుడు.

14.
రూపించి పలికి బొంకకు
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ
గోపించురాజుఁ గొల్వకు
పాపుదేశంబు సొరకు పదిలము సుమతీ!

తాత్పర్యం: సాక్షులతో నిర్ధారణ చేసి అబద్ధాన్ని నిజమని స్థిరపరచడం, ఆప్తబంధువులను నిందించడం, కోపిని సేవించడం, పాపభూమికి వెళ్లడం తగని పనులు. కావున ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

15.
రా పొమ్మని పిలువని యా
భూపాలునిఁ గొల్వ ముక్తి ముక్తులు గలవే
దీపంబు లేని ఇంటను
చెవుణికీళ్లాడినట్లు సిద్ధము సుమతీ!

తాత్పర్యం: దీపంలేని ఇంట్లో చేవుణికీళ్లాట ఆడితే ఏవిధంగా ఆనందం కలగదో ఆ విధంగానే రమ్మని కానీ పొమ్మని కానీ చెప్పని రాజును సేవించడం వల్ల జీవమూ లేదు. మోక్షమూ లేదు. వట్టి నిష్ప్రయోజనం.

16.
నాది నొకని వలచియుండగ
మదిచెడి యొక క్రూరవిటుడు మానక తిరుగున్‌
బొది జిలుక పిల్లి పట్టిన
జదువునె యా పంజరమున జగతిని సుమతీ!

తాత్పర్యం: పిల్లి పంజరాన్ని పట్టుకుంటే ఆ పంజరంలో ఉన్న చిలుక మాట్లాడుతుందా? అలాగే, మనసులో ఒకతన్ని ప్రేమించిన స్త్రీ విటుడు ఎంత బతిమాలినా ప్రేమించదు.

17.
మానఘనుఁ డాత్మధృతిఁ జెడి
హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్‌
మానెడు జలములలోపల
నేనుఁగు మెయి దాఁచినట్టు లెరగుము సుమతీ!

తాత్పర్యం: అభిమాన శ్రేష్టుడు మనోధైర్యం చెడి అల్పుని ఆశ్రయించడం మానెడు నీళ్లలో ఏనుగు తన శరీరాన్ని మరుగుపరచినట్లుండును.

18.
మాటకు బ్రాణము సత్యము
కోటకుఁ బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్‌
బోటికిఁ బ్రాణము మానము
చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!

తాత్పర్యం: నోటిమాటకు సత్యం, పెద్ద దుర్గానికి గొప్ప సైన్య సమూహం, స్త్రీకి అభిమానం, పత్రానికి చేవ్రాలు ముఖ్యమైన ఆధారాలు.

19.
మంత్రిగలవాని రాజ్యము
తంత్రము సెడకుండ నిలచుఁ దరచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపుఁగీలూడినట్లు జరుగదు సుమతీ!

తాత్పర్యం: సమర్థుడైన మంత్రి ఉంటే సామ, దాన, భేద, దండ వంటి ఉపాయాలు పాడుకాకుండా సాగిపోతాయి. అలాంటి మంత్రి లేకపోతే కీలూడిపోయిన యంత్రంలా ముందుకు సాగవు.

20.
మండలపతి సముఖంబున
మెండైన ప్రధానిలేక మెలఁగుట యెల్లన్‌
గొండంత మదపుటేనుగు
తొండము లేకుండినట్లు తోచుర సుమతీ!

తాత్పర్యం: కొండంత పెద్దదైన ఏనుగు అయినా తొండం లేకపోతే ఎలా శోభావిహీనంగా ఉంటుందో అలాగే, గొప్ప దేశాన్ని పరిపాలించే రాజు దగ్గర సమర్థుడైన మంత్రి లేకపోతే అతని పాలన అంతే శోభావిహీనమవుతుంది.

సుమతి పద్యములు (01 - 10)


1.
స్త్రీల ఎడ వాదులాడక
బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!

తాత్పర్యం: స్త్రీలతో ఎప్పుడూ గొడవపడద్దు. చిన్నపిల్లలతో స్నేహం చేసి మాట్లాడవద్దు. మంచి గుణాలను వదలవద్దు. యజమానిని దూషించవద్దు.


2.
సిరి దా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలలితము భంగిన్‌
సిరి దాఁ బోయిన బోవును
కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!

తాత్పర్యం: సంపద వచ్చినప్పుడు కొబ్బరికాయలోకి నీరు వచ్చిన విధంగా రమ్యంగానే ఉంటుంది. అలాగే పోయినప్పుడు ఏనుగు మింగిన వెలగపండులో గుంజు మాయమైనట్లే పోతుంది.

3.
మేలెంచని మాలిన్యుని
మాలను నగసాలివాని మంగలి హితుగా
నేలిన నరపతి రాజ్యము
నేలఁగలసిపోవుగాని నెగడదు సుమతీ!

తాత్పర్యం: ఉపకారాన్ని గుర్తుంచుకోని దుర్మార్గుడ్ని, పంచముని, కంసాలివానిని, మంగలిని హితలుగా చేసుకొని పాలించే రాజు రాజ్యము మట్టిలో కలిసి నాశనం అవుతుంది కానీ కీర్తిని పొందదు.

4.
సరసము విరసము కొరకే
పరిపూర్ణ సుఖంబు అధిక బాధల కొరకే
పెరుగుట విరుగుట కొరకే
ధర తగ్గుట హెచ్చుకొరకే తధ్యము సుమతీ!

తాత్పర్యం: హాస్యపు మాటలు విరోధము కొరకే. సంపూర్ణ సౌఖ్యాలు విస్తారమైన బాధల కోసమే. పొడవుగా ఎదుగుట విరిగిపోవడానికే. ధరవరలు తగ్గడం మళ్లీ పెరగడానికే అని మనుషులు తెలుసుకోవాలి.

5.
శుభముల నొందని చదువును
అభినయమున రాగరసము నందని పాటల్‌
గుభగుభలు లేని కూటమి
సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ!

తాత్పర్యం: శుభాలు పొందని విద్య, నటన, సంగీత, సామరస్యంతో కూడిన పాటలు, సందడి లేని కలయిక, సభల్లో మెప్పు పొందని మాటలు రుచించవు. చప్పనయినవి.

6.
వేసరవు జాతి కానీ
వీసముఁ దాజేయనట్టి వ్యర్థుడు గానీ
దాసి కొడుకైన గాని
కాసులు గలవాఁడే రాజు గదరా సుమతీ!

తాత్పర్యం: నీచ జాతివాడైనా, నిష్ప్రయోజకుడైనా, దాసీ పుత్రుడైనా ధనం కలవాడే అధిపతి

7.
వెలయాలు సేయు బాసలు
వెలయఁగ నగపాలి పొందు, వెలమల చెలిమిన్‌
గలలోఁన గన్న కలిమియు,
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!

తాత్పర్యం: వేశ్య ప్రమాణాలు, విశ్వబ్రాహ్మణుని స్నేహం, వెలమదొరల జత, కలలో చూసిన సంపదలను స్పష్టంగా నమ్మరాదు.

8.
వెలయాలివలనఁ గూరిమి
గలుగదు మరి గలిగెనేని కడతేరదుగా
పలువురు నడిచెడి తెరుపునఁ
బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతీ!

తాత్పర్యం:పదిమంది నడిచే బాటలో పచ్చగడ్డి మొలవదు. ఒకవేళ మొలిచినా పెరగదు. ఆ విధంగానే వేశ్యవల్ల ప్రేమ లభించదు. ఒకవేళ లభించినా ఎక్కువకాలం నిలవదు.

9.
వీడెము సేయని నోరును
జేడెల యధరామృతంబుఁ జేయని నోరును
బాడంగరాని నోరును
బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!

తాత్పర్యం: తాంబూలం వేసుకోని, స్త్రీల అధరామృత పానం చేయని, గానం చేయని నోరు పెంట బూడిద పోసుకొనే గోయితో సమానం సుమా!

10.
వినదగు నెవ్వరుచెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్‌
కనికల్ల నిజము దెలిసిన
మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ!

తాత్పర్యం: ఎవరు ఏం చెప్పినా వినవచ్చు. విన్నా వెంటనే తొందరపడకుండా బాగా పరిశీలన చేయాలి. అలా పరిశీలించి అది నిజమో అబద్దమో తెలుసుకొన్న మనిషే ధర్మాత్ముడు.

శ్రీ శ్రీ - మహా ప్రస్థానం (36. జగన్నాథుని రథచక్రాలు)

36. జగన్నాథుని రథచక్రాలు

పతితులార !
భ్రష్టులార !
బాధాసర్ప దష్టులార !
బ్రదుకు కాలి,
పనికిమాలి,
శని దేవత రథచక్రపు
టిరుసులలో పడి నలిగిన
దీనులార !
హీనులార !
కూడు లేని, గూడు లేని
పక్షులార ! భిక్షులార !
సఖులవలన పరిచ్యుతులు,
జనులవలన తిరస్కృతులు,
సంఘానికి బహిష్కతులు---
జితాసువులు,
చ్యుతాశయులు,
హృతాశ్రయులు,
హతాశులై
ఏడవకం డేడవకండి !
మీరక్తం, కలగి కలగి
మీ నాడులు కదలి కదలి
మీ ప్రేవులు కనలి కనలి
ఏడవకం డేడవకండి.
ఓ వ్యథానివిష్టులార !
ఓ కథావశిష్టులార !
పతితులార !
భ్రుష్టులార !
బాధాసర్పదష్టులార !
ఏడువకం డేడవకండి !
వస్తున్నా యొస్తున్నాయి...
జగన్నాథ,
జగన్నాథ,
జగన్నాథ రథచక్రాల్‌ !
జన్నాథుని రథచక్రాల్‌ !
రథచక్రాల్‌,
రథచక్రాల్‌,
రథచక్రాల్‌, రథచక్రా
లోస్తున్నా యొస్తున్నాయి !
పతితులార !
భ్రుష్టులార !
మొయిల్దారిని
బయల్దేరిని
రథచక్రాల్‌, రథచక్రా
లోస్తున్నా యొస్తున్నాయి !
సింహాచలం కదిలింది,
హిమాలయం కరిగింది,
వింధ్యాచలం పగిలింది---
సింహాచలం,
హిమాచలం,
వింధ్యాచలం, సంధ్యాచలం...
మహానగా లెగురుతున్నాయి !
మహారథం కదులుతున్నాది !
చూర్ణమాన
ఘూర్ణమాన
దీర్ణమాన గిరిశిఖరాల్‌
గిరగిరగిర తిరుగుతున్నాయి !
పతితులార !
భ్రుష్టులార !
బాధాసర్పదష్టులార !
రారండో ! రండో! రండి!
వూరవతల నీరింకిన
చెరువుపక్క, చెట్టునీడ---
గోనెలతో, కుండలతో,
ఏడుచూస్తే అటు చీకటి,
అటు దుఃఖం, పటునిరాశ---
చెసాలలు, ఉరికొయ్యలు,
కాలువలో ఆత్మహత్య !
దగాపడిన తమ్ములార !
మీ బాధలు నే నెరుగుదును...
వడలో, కడు
జడిలో, పెను
చలిలో తెగనవసి కుములు
మీ బాధలు, మీ గాధలు
అవగాహన నాకవుతాయి
పతితులార !
భ్రుష్టులార !
దగాపడిన తమ్ములార !
మీ కోసం కలం పట్టి ,
ఆకసపు దారులంట
అడావుడిగ వెళిపోయే,
అరుచుకుంటు వెళిపోయే
జగన్నాథుని రథచక్రాల్‌,
రథచక్ర ప్రళయఘోష
భూమార్గం పట్టిస్తాను !
నట ధూర్జటి
నిటాలాక్షి పగిలిందట !
నిటాలాగ్ని రగిలిందట !
నిటాలాగ్ని !
నిటాలాగ్ని !
నిటాలాక్షి పటాలుమని
ప్రపంచాన్ని భయపెట్టింది !
అరెఝా ! ఝా!
ఝుటక్‌, ఫటక్‌ ...
హింసనణచ
ధ్వంసరచన
ధ్వంసరచన
హింసరచన
విషవాయువు, మరఫిరంగి,
టార్పీడో, టోర్నిడో!
అది విలయం,
అదిసమరం,
అటో యిటో తెగిపోతుంది ?
సంరంభం,
సంక్షోభం,
సమ్మర్దన, సంఘర్షణ !
హాలహలం పొగ చూరింది !
కోలాహలం చెలరేగింది !
పతితులార !
భ్రష్టులార !
ఇది సవనం,
ఇది సమరం !
ఈ యెరిగిన ఇనుప డేగ,
ఈ పండిన మంట పంట,
ద్రోహాలను తూలగొట్టి,
గోషాలను తుడిచిపెట్టి,
స్వాతంత్య్రం,
సమభావం,
సౌభ్రాత్రం
సౌహార్దం
పునాదులై ఇళ్లు లేచి,
జనావళికి శుభం పూచి---
శాంతి, శాంతి, శాంతి, శాంతి
జగమంతా జయిస్తుంది,
ఈ స్వప్నం నిజమవుతుంది !
ఈ స్వర్గం ఋజు వవుతుంది !
పతితులార !
భ్రష్టులార !
బాధాసర్పదష్టులార !
దగాపడిన తమ్ములార !
ఏడవకం డేడవకండి !
వచ్చేశాయ్‌ , విచ్చేశాయ్‌,
జగన్నాథ,
జగన్నాథ,
జగన్నాథ రథచక్రాల్‌,
జగన్నాథుని రథచక్రాల్‌
రథచక్రాల్‌,
రథచక్రాల్‌,
రథచాక్రాల్‌, రథచక్రాల్‌,
రారండో! రండో! రండో!
ఈ లోకం మీదేనండి!
మీ రాజ్యం మీ రేలండి

శ్రీ శ్రీ - మహా ప్రస్థానం (35. పేదలు)

35. పేదలు

అంతేలే, పేదల గుండెలు !
అశ్రువులే నిండిన కుండలు !
శ్మశానమున శశికాంతులలో
చలిబారిన వెలి రాబండలు !
అంతేలే, పేదల మూపులు !
అణగార్చిగ విధి త్రోద్రోపలు,
పయోధితట కుటీరములవలె
భరియించవు బాధల మోపులు !
అంతేలే, పేదల చేతులు !
శ్లథశైశిర పలాశరీతులు !
విశుష్కములు, పరిపాండురములు !
విచలించెడు విషాదహేతులు !
అంతేలే, పేదల కన్నులు !
వినమ్రములు, వెతల వ్రణమ్ములు !
తుపానులో తడిసిన, జడిసిన
గోమాతల కన్నుల తమ్ములు !
అంతేలే, పేదల కన్నులు !
తిరిపెమునకు పిడికెడు మెతుకులు !
తిరువెరుగని దీర్ఘ రాత్రిలో
తల పగిలెడి తలపుల గతుకులు !

శ్రీ శ్రీ - మహా ప్రస్థానం (34. కేక)

34. కేక

నిద్రకు వెలియై...
నే నొంటరినై...
నా గదిలోపల చీకటిలో
చీకటిలోపల నాగదిలో!
నా గదిలో...
చీకటిలో...
నే నొక్కడనై...
నిద్రకు వెలియై...
కన్ను లనిండిన కావిరితో!
కావిరి నిండి కన్నులతో!
కన్నులలో...
కావిరితో...
నిద్రకు వెలియై...
నే నొక్కడనై...
గుండెలకప్పిన కుంపటితో!
కుంపటికప్పిన గుండెలతో!
గుండెలలో...
కుంపటితో...
నా కనుగోనల,
నా యెదగోడల,
నాలుగు దిక్కుల బాకులతో...
బాకుల తోటల బాటలతో...
బాటలలో...
బాకులతో...
భగ భగ భుగ భుగ
భగ భగ మండే
నా గది చీకటి నాలుకతో!
నాలుక చీలిన నాగులతో!
నా గదిలో...
నాగులతో...
ఇరవై కోరల,
అరవై కొమ్ముల,
క్రూర ఘోర కర్కోటకులో?
కోరకి కన్నూ,
కొమ్ముకి కన్నూ,
కర్కాటక కర్కోటకులో?
దారుణ మారణ దానవ భాషలు!
ఫేరవ భైరవ భీకర ఘోషలు!
ఘేషల భాషల,
ఘంటల మంటల
కంటక కంఠపు గణగణలో?
చిటికెల మెటికల చిటపటలో?
నీ నొంటరినై...
నిద్రకు వెలియై...
చీకటిలోపల నాగదిలో!
నాగది లోపల చీకటిలో!
చీకటిలో...
ఆకటితో...

శ్రీ శ్రీ - మహా ప్రస్థానం (33. దేని కొరకు)

33. దేని కొరకు

వేళకాని వేళలలో,
లేనిపోని వాంఛలతో-
దారికాని దారులలో,
కానరాని కాంక్షలతో -
దేని కొరకు పదే పదే
దేవులాడుతావ్‌?
ఆకటితో, అలసటతో,
ప్రాకులాడుతావ్‌?
శ్రీనివాసరావ్‌!
శ్రీనివాసరావ్‌!
దేనికోసమోయ్‌?
నడిరాతిరి కడలివద్ద
హోరుగాలి ఉపశ్రుతిగ,
నీలోనే నీవేదో
ఆలపించుతావ్‌?
ఆవ్యక్తపు టూహలతో
ఆలపించుతావ్‌?
జగమంతా నిదుర మునిగి
సద్దణగిన నడిరాతిరి
నీలోనే నీవేదో
ఆలకించుతావ్‌?
శ్రీనివాసరావ్‌!
శ్రీనివాసరావ్‌!

శ్రీ శ్రీ - మహా ప్రస్థానం (32. సంధ్యా సమస్యలు)

32. సంధ్యా సమస్యలు

ఆ సాయంత్రం...
రాక్సీలో నార్మా షేరర్‌,
బ్రాడ్వేలో కాంచనమాల;
ఎట కేగుటో సమస్య తగిలిం
దొక విద్యార్థికి!
ఉడిపీ శ్రీకృష్ణవిలాస్‌లో-
అటు చూస్తే బాదం హల్వా,
ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ!
ఎంచుకొనే సమస్య కలిగిందొక ఉద్యోగికి!
ఆ సాయంత్రం...
ఇటు చూస్తే అప్పులవాళ్లూ
అటు చూస్తే బిడ్డల ఆకలి!
ఉరిపోసుకు చనిపోవడమో,
సముద్రమున పడిపోవడమో-
సమస్యగా ఘనీభవించిం
దొక సంసారికి!

శ్రీ శ్రీ - మహా ప్రస్థానం (31. మానవుడా!)

31. మానవుడా!

రాశి చక్రగతులలో
రాత్రిందివాల పరిణామాలలో,
బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో,
కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన
పరమాణువు సంకల్పంలో,
ప్రభవం పొందినవాడా!
మానవుడా! మానవుడా!
సౌందర్యం ఆరాధించేవాడా!
కవితలో, శిల్పంలో-
పురుగులో, పుష్పంలో-
మెరుపులో, మేఘంలో
సౌందర్యం ఆరాధించేవాడా!
జీవించేవాడా!
సుఖించేవాడా! దుఖించేవాడా!
విహ్వలుడా! వీరుడా!
ప్రేమించేవాడా!
వియోగీ! యోగీ! భోగీ! త్యాగీ!
ఆలోచనలు పోయేవాడా!
అనునిత్యం అన్వేషించేవాడా!
చెట్టూ, చెరువూ, గట్టూ, పుట్టా,
ఆకసంలో, సముద్రంలో
అన్వేషించేవాడా!
అశాంతుడా! పరాజయం ఎరుగనివాడా!
ఊర్ధ్వదృష్టీ! మహామహుడా!
మహా ప్రయాణికుడా!
మానవుడా! మానవుడా!
కాట్లాడుకునేవాడా!
ఓర్వలేనివాడా!
సంకుచిత స్వభావుడా!
అయ్యో! మానవుడా!
ఓహో! మానవుడా!
ధర్మస్థాపనకు యుద్ధం చేసేవాడా!
అన్యాయం భరించలేని వాడా!
ఆదర్శజీవి! మహాత్మా! మానవుడా!
ఆసియా, అమెరికా, యూరప్‌,
ఆఫ్రికా, ఆస్ట్రేలియాలలో
సముద్ర ద్వీపాలలో,
ధ్రువప్రాంతాలలో
పట్టణాలలో, పల్లెలలో,
ధనివో, దరిద్రుడవో,
వృద్ధుడవో, యువకుడవో,
తెల్లని, నల్లని, ఎర్రని, పచ్చని రంగో,
బలవంతుడివో! బలహీనుడివో
బ్రదికేవాడా! పాడేవాడా! మానవుడా! మానవుడా!
అవిభక్తకుటుంబీ!
ఏకరక్తబంధూ!
మానవుడా! మానవుడా!
అనేకభాషలు మాట్లాడేవాడా!
అనేకస్థలలో తిరిగేవాడా!
అనేక కాంతులు వెదజల్లేవాడా
సహృదయా! సదయా! సన్మార్గగామీ!
సముద్రాలు దాటేవాడా
ఎడారులూ, పర్వతాలూ గడచేవాడా!
ఆకాశాలను వెదికేవాడా!
నక్షత్రాలను శోధించేవాడా!
పిపాసీ, తపస్వీ!
వంతెనలు నిర్మించినవాడా!
వైద్యశాలలు, వస్తుప్రదర్శనశాలలు,
గ్రంథాగారాలు, పరిశ్రమాలయాలు,
ధూమశకటాలూ, నౌకలూ, విమానాలూ
నిర్మించినవాడా!
దూరదృష్టి, దూరశ్రవణశక్తులు
సాధించినవాడా!
మానవుడా! మానవుడా!
రసైకజీవీ!
కవీ! నటుడా! శిల్పాచార్యా!
గానకళాకోవిదుడా! వేదాంతీ!
విజ్ఞానధనీ! భవధునీ!
దుఃఖమయా! దయాళూ! పరదుఃఖా సహనశీలీ!
చీమనుకూడా చంపడానికి
చేతులురానివాడా!
బుద్ధమూర్తీ!
జీసస్‌!
సంఘపశూ! శ్రమైకజీవీ!
శరీర పరీవృతుడా!
ఘర్మవర్ష పయోధుడా!
రక్తకణ సమష్టి కుటుంబీ!
కష్టజీవి! కార్మికుడా! మానవుడా!
కూలీ! మాలీ! రైతూ!
గుడిసెలలో బ్రదికేవాడా!
గంజినీళ్లు తాగి కాలం గడిపేవాడా!
కడుపెడు సంతానం కలిగినవాడా!
ఆకలికన్నూ! మానవుడా!
తిరగబడేవాడా! ప్రశ్నించేవాడా!
అన్యాయాలకు ఆహుతి కావడానికైనా
జంకనివాడా!
ఖైదీ!
రౌడీ!
ఖూనీకోర్‌!
బేబి!
మానవుడా! మానవుడా!

శ్రీ శ్రీ - మహా ప్రస్థానం (30. దేశచరిత్రలు)

30. దేశచరిత్రలు

ఏ దేశచరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం
నరజాతి చరిత్ర సమస్తం
పరస్పరాహరణోద్యోగం:
రణరక్త ప్రవాహసిక్తం
బీభత్సరస ప్రధానం.
పిశాచగణ సమవాకారం:
నరజాతి చరిత్ర సమస్తం
దరిద్రులను కాల్చుకుతినడం
బలవంతులు దుర్బల జాతిని
బానిసలను కావించారు:
నరహంతలు ధరాధిపతులై
చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి
రణరంగం కానిచోటు భూ
స్థలమంతా వెదికిన దొరకదు
గతమంతా తడిసె రక్తమున,
కాకుంటే కన్నీళులతో
చల్లారిన సంసారాలూ
మరణించిన జన సందోహం
అసహాయుల హహాకారం
చరిత్రలో నిరూపించినవి
జెంఘిజ్‌ఖాన్‌, తామర్లేనూ,
నాదిర్షా, ఘజ్నీ, ఘోరీ,
సికిందరో ఎవడైతేనేం?
ఒక్కొక్కడూ మహాహాంతకుడు
వైకింగులు, శ్వేత హుణులూ
సిధియన్లు, పారశీకులూ,
పిండారులు, థగ్గులు కట్టిరి
కాలానికి కత్తుల వంతెన
అజ్ఞానపు టంధయుగంలో
ఆకలిలో, ఆవేశంలో-
తెలియని ఏ తీవ్రశక్తులో
నడిపిస్తే నడిచి మనుష్యులు
అంతా తమ ప్రయోజకత్వం
తామే భువి కధినాధులమని,
స్థాపించిన సామ్యాజ్యాలూ,
నిర్మించిన కృత్రిమచట్టాల్‌
ఇతరేతర శక్తులు లేస్తే
పడిపోయెను పేక మేడలై
పరస్పరం సంఘర్షించిన
శక్తులలో చరిత్ర పుట్టెను.
చిరకాలం జరిగిన మోసం,
బలవంతుల దౌర్జన్యాలూ,
ధనవంతుల పన్నాగాలూ
ఇంకానా! ఇకపై చెల్లవు
ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ,
ఒక జాతిని వేరొక జాతీ,
పీడించే సాంఘిక ధర్మం
ఇంకానా ? ఇకపై సాగదే.
చీనాలో రిక్షావాల,
చెక్‌ దేశపు గని పనిమనిషీ,
ఐర్లాండున ఓడ కళాసీ,
అణగారిన ఆర్తులందరూ-
హటెన్‌టాట్‌, జాలూ, నీగ్రో
ఖండాంతర నానా జాతుల
చారిత్రక యథార్థతత్వం
చాటిస్తారొక గొంతుకతో
ఏ యుద్ధం ఎందుకు జరిగినొ?
ఏ రాజ్యం ఎన్నాళ్లుందో?
తారాఖులు, దస్తావేజులు
ఇవి కావోయ్‌ చరిత్రకర్థం
ఈ రాణీ ప్రేమపురాణం,
ఆ ముట్టడికైన ఖర్చులూ,
మతలబులూ, కైఫీయతులూ
ఇవి కవోయ్‌ చరిత్రసారం
ఇతిహాసపు చీకటి కోణం
అట్టడుగున పడి కాన్పించని
కథలన్నీ కావాలిప్పడు!
దాచేస్తే దాగని సత్యం
నైలునదీ నాగరికతలో
సామాన్యుని జీవనమెట్టిది?
తాజమహల్‌ నిర్మాణానికి
రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?
సామ్రాజ్యపు దండయాత్రలో
సామాన్యుల సాహసమెట్టిది?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌,
అది మోసిన బోయీ లెవ్వరు?
తక్షశిలా, పాటలీ పుత్రం,
హారప్పా, మొహంజొదారో,
క్రో-మాన్యాన్‌ గుహముఖాల్లో
చారిత్రక విభాత సంధ్యల
మానవకథ వికాసమెట్టిది?
ఏ దేశం ఏ కాలంలో
సాధించిన దే పరమార్థం?
ఏ శిల్పం? ఏ సాహిత్యం?
ఏ శాస్త్రం?ఏ గాంధర్వం?
ఏ వెల్గుల కీ ప్రస్థానం?
ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?

శ్రీ శ్రీ - మహా ప్రస్థానం (29. కవితా! ఓ కవితా!)

29. కవితా! ఓ కవితా!

కవితా! ఓ కవితా!
నా యువకాళల నవపేళల సుమగీతావరణంలో
నిను నే నొక సుముహూర్తంలో,
అతి సుందర సుస్యందనమందున
దూరంగా వినువీథుల్లో విహరించే
అందని అందానివిగా
భావించిన రోజులలో,
నీకై బ్రతుకే ఒక తపమై
వెదుకాడే నిమిషాలందు విషాలందున,
ఎటు నే చూచిన చటులాలంకారపు
మటుమాయల నటనలలో
నీ రూపం కనరానందున,
నా గుహలో, కుటిలో, చీకటిలో
ఒక్కడనై స్రుక్కిన రోజులు లేవా?
నీ ప్రాబల్యంలో,
చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో,
నిశ్చల సమాధిలో,
సర్గద్వారపు తోరణమై వ్రెలిన నా
మస్తిష్కంలో
ఏయే ఘోషలు, భాషలు, దృశ్యాల్‌ తోచాయో?
రోచర్ని వహం చూశానో!
నా గీతం ఏయే శక్తులలో
ప్రాణస్పందన పొందిందో?
నీకై నే నేరిన వేయే ధ్వనులో,
ఏయే మూలల వెదికిన ప్రోవుల
ప్రోవుల రణన్ని నాదాలో:
నడిరే యాకస మావర్తించిన,
మేఘా లావర్షించిన,
ప్రచండ ఝంఝూ ప్రభంజనం
గజగజ లాడించిన
నడిసంద్రపు కెరటాల్లో మ్రోగిన
శంఖారావం, ఢంకాధ్వానం:
ఆ రాత్రే,
కారడవులలో లయాతీతమై
విరుతించిన నానాజంతుధ్వనులో?
నక్షత్రాంతర్ని బిడ నిఖిలగానం,
భూకంపాలు, ప్రభుత్వ పతానాలు,
విప్లవం, యుద్ధం,
అన్నీ నీ చైతన్యం!
నీ విశ్వరూప సాక్షాత్కారం
మరి నిన్ను స్మరిస్తే
నా కగుపించే దృశ్యాలా?
వినిపించే భాష్యాలా?
అగ్ని సరస్సున వికసించిన వజ్రం!
ఎగిరే లోహ శ్యేనం!
ఫిరంగిలో జ్వరం ధ్యనించే మృదంగ నాదం
ఇంకా నే నేం విన్నానా?
నడిరే నిద్దురలో
అపుడే ప్రసవించిన శిశువు నెడద నిడుకొని
రుచిర స్వప్నాలను కాంచే
జవరాలి మనఃప్రపంచపు, టాపర్తాలు!
శిశువు చిత్ర నిద్రలో
ప్రాచీన స్మృతు లూచే చప్పుడు!
వైద్యశాలలో,
శస్త్రకారుని మహేంద్రజాలంలో,
చావుబ్రదుకుల సంధ్యాకాలంలో
కన్నులుమూసిన రోగార్తుని
రక్తనాళ సంస్పందన!
కాలువ నీళులలో జారిపడి
కదలగ నైనా చాలని
త్రాగుబోతు వ్యక్తావ్యక్తాలాపన!
ప్రేతాపన!
కడుపు దహించుకుపోయే
పడుపుకత్తె రాక్షసరతిలో
అర్థనిమీలత నేత్రాల
భయంకర బాధల పాటల పల్లవి!
ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం!
ఉన్మాది మనస్సినీవాలిలో
ఘకంకేకా, భేకంబాకా!
సమ్మెకట్టిన కూలీల,
సమ్మెకట్టిన కూలీల భార్యల, బిడ్డల
ఆకటి చీకటి చిచ్చుల
హాహాకారం! ఆర్తారావం!
ఒక లక్ష నక్షత్రాల మాటలు,
ఒక కోటి జలపాతల పాటలు,
శతకోటి సముద్రతరంగాల మ్రోతలు!
విన్నానమ్మా! విన్నా, నెన్నో విన్నాను.
నా విన్నవి కన్నవి విన్నవించగా
మాటలకై వెదుకాడగబోతే---
అవి,
ఫంఖానుఫుంఖంగా
శ్మశానాలవంటి నిఘంటవుల దాటి,
వ్యాకరణాల సంకెళ్ళ విడిచి,
ఛందస్సుల సర్పపరిష్వంగం వదలి---
వడిగా, వడివడిగా
వెలువడినై, పరుగిడినై, నా యెదనడుగిడినై!
ఆ చెలరేగిన కలగాపులగపు
విలయావర్తపు
బలవత్‌ ఝరావత్‌ పరివర్తనలో,
నే నేయే వీధులలో
చంక్రమణం చేశానో,
నా సృష్టించిన గానంలో
ప్రక్షుళిత మామక పాపపరంపర
లానంద వశంవద హృదయుని జేస్తే--
నీకై మేలుకొనిన
సకలేంద్రియములతో
ఏది రచిస్తునానో, చూస్తున్నానో,
వూపిరి తీస్తున్నానో
నిర్వికల్ప సమాధిలో
నా ప్రాణం నిర్వాణం పొందిందో,
అటు నను మంత్రించిన,
సమ్ముగ్ధంగావించిన ఆ గాంధర్వానికి,
తారానివహపు ప్రేమసమాగమంలో
జన్మించిన సంగీతానికి...
నా నాడుల తీగలపై సాగిన
నాధ బ్రహ్మపు పరిచుంబనలో,
ప్రాణావసానవెళాజనితం,
నానాగానానూనస్వానావళితం,
బ్రతుకును ప్రచండభేరుండ గరు
త్పరిరంభంలో పట్టిన గానం,
సుఖదుఃఖాదిక ద్వంద్వాతీతం,
అమోఘ, మగాధ, మచింత్య, మమేయం,
ఏకాంతం, ఏకైకం,
క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం,
బ్రహ్మాసుంభవం కలిగించిన,
నను కరిగించిన కవనఘృణీ!
రమణీ!
కవితా! ఓ కవితా!
నా జనని గర్భంలో,
ఆకారం లేకుండా నిద్రిస్తూన్న
నా అహంకారానికి
ఆకలి గొల్పించిన నాడో!
నా బహిరంత రింద్రియాలలో
ప్రాణం ప్రసరించగ, నే నీ భూలోకంలో పడి
సఖదుఃఖా లేవేవో
వస్తూంటే తలదాలిచి
ప్రపంచ పరిణాహంలో
ప్రయాణికుడనై,
పరివ్రాజకుడనై,
విహ్వలంగా వర్తించేవేళ
అభయహస్త ముద్రతో ననుదరిసిన
నన్ను పునీతుని కావించిన కవితా!
లలిత లలిత కరుణామహితా!
అనుపమితా!
అపరిమితా!
కవితా! ఓ కవితా
నేడో నా వూహాంచల
సాహసికాంసం కప్పిన నా
నిట్టూర్పులు వినిపిస్తాయా?
నే నేదో విరచిస్తానని,
నా రచనలలో లోకం ప్రతిఫలించి,
నా తపస్సు ఫలించి,
నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ
నా జాతి జనులు పాడుకొనే
మంత్రంగా మ్రోగించాలని
నా ఆకాశాలను
లోకానికి చేరువగా,
నా ఆదర్శాలను
సోదరులంతా పంచుకునే
వెలుగుల రవ్వల జడిగా,
అందీ అందకపోయే
నీ చేలాంచముల విసరుల
కొసగాలులలో నిర్మించిన
నా నుడి నీ గుడిగా,
నా గీతం నైవేద్యంగా, హృద్యంగా,
అర్పిస్తానో
నా విసరిన రస వినృమర
కుసుమ పరాగం!
ఓహో! ఓ రసధుని! మణిఖని! జననీ! ఓ కవితా!
కవితా! కవితా! ఓ కవితా!